Panchakula Clashes
-
ముప్పుతిప్పలు పెడుతున్న హనీప్రీత్
సాక్షి, చండీగఢ్ : హరియాణా పోలీసుల నుంచి 38 రోజులపాటు తప్పించుకు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టిన డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసుల ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పంచకుల అల్లర్ల కేసులో పోలీసు అధికారులు ఆమెను మొత్తం 40 ప్రశ్నలు అడగ్గా కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సూటిగా సమాధానం ఇచ్చారు. 13 ప్రశ్నలకు అసలు సమాధానం ఇవ్వడానికే హనీప్రీత్ నిరాకరించారు. మిగతా 25 ప్రశ్నలకు కాదని, లేదా గందరగోళమైన సమాధానాలు ఇచ్చారు. కోర్టు మొత్తం ఆరు రోజుల కస్టడీ ఇచ్చినందున మరో రెండు పర్యాయాలు ఆమెను విచారిస్తామని, అప్పటికీ హనీప్రీత్ సరైనా సమాధానాలు ఇవ్వక పోయినట్లయితే నార్కో పరీక్షలకు అనుమతి కోరుతామని పంచకుల పోలీసు కమిషనర్ ఏస్ చావ్లా తెలిపారు. డేరా వాహనాల్లో ఎందుకు అక్రమ ఆయుధాలు తీసుకెళ్లారు, సిర్సా వద్ద డేరా వాహనాలన్ని ఎందుకు తగలబెట్టారు, అల్లర్లు సృష్టించేందుకు డేరా అనుచరులకు ఐదు కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు, అంతర్జాతీయ సిమ్ కార్డుతోపాటు పలు భారత సిమ్ కార్డులను మార్చి మార్చి మాట్లాడడం గురించి అడిగిన ప్రశ్నలకు హనీప్రీత్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. డేరా నుంచి పారిపోయిన డాక్టర్ ఆదిత్యతో వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌కు సంబంధించిన రెండు ప్రశ్నలకు మాత్రమే ఆమె సరైన సమాధానాలు ఇచ్చారని పోలీసు కమిషనర్ చావ్లా చెప్పారు. ఆజ్‌తక్, ఇండియా టుడీ టీవీలకు గురువారం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత హానీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. పంచకులలో జరిగిన అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలినని ఆమె టీవీ ఛానళ్లతో చెప్పారు. పంచకుల అల్లర్లలో 30 మంది మరణించడం, 350 మందికిపైగా గాయపడడం తెల్సిందే. ఈ కేసులో హనీప్రీత్‌ను అరెస్ట్ చేయగానే హరియాణా పోలీసులు ఆమెను 43 మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చారు. కోర్టు ఆమెను ఆరు రోజుల కస్టడీకి అప్పగించాక ఇన్ని రోజులు పాటు పంజాబ్, హరియాణాలోని ఏయే ప్రాంతాల్లో తలదాచుకున్నారో అక్కడకి హనీప్రీత్‌ను తీసుకొని పోలీసు వెళ్లారు. ఆమెతో కొన్ని రోజులు గడిపిన డేరా బాబా గుర్మీత్ డ్రైవర్ ఇక్బాల్ సింగ్ భార్య సుఖ్దీప్ సింగ్‌ను కూడా తీసుకొని బటిండాకు పోలీసులు వెళ్లారు. అక్కడ హానీప్రీత్ నాలుగు రోజులపాటు తన మామతో కూడా ఉన్నారు. ఆమె వెళ్లిన సంగ్రూర్, తాపమండి, రాంపుర ప్రాంతాలకు కూడా పోలీసులు వెళ్లి ప్రాథమిక విచారణ జరిపారు. -
కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న హనీప్రీత్
హరియాణా : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పెంపుడు కుమార్తె హనీప్రీత్‌ను హరియాణా పోలీసులు బుధవారం పంచకుల కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం.. ఆమెను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. గుర్మిత్తో సంబంధాలు, అరెస్ట్ సమయంలో హింస, ఆశ్రమంలో అరాచకాలపై హనీప్రీత్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా కోర్టులో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గుర్మిత్ తనకు తండ్రిలాంటివారని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని హనీప్రీత్ అన్నారు. గుర్మీత్ జైలు పాలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన హనీప్రీత్‌ను మంగళవారం పంజాబ్‌లోని జిరాక్పూర్–పాటియాలా మార్గంలో అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ (బుధవారం) తెల్లవారుజాము మూడు గంటల వరకూ ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో తనకు ఛాతీనొప్పి వస్తున్నట్లు తెలపటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. హనీప్రీత్ పరీక్షలు నిర్వహించి వైద్యులు...ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హింసాకాండ చెలరేగిన విషయం విదితమే. నిరసనకారులు మీడియా ఓబీ వ్యాన్లను దగ్ధం చేస్తూ, రాళ్లు విసురుతూ.. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ జాబితాలో హనీప్రీత్ ఇన్సాన్ది మొదటి పేరు కావడం గమనార్హం. -
తప్పంతా హర్యానా ప్రభుత్వానిదే: పంజాబ్ సీఎం
ఛండీగఢ్; డేరా అనుచరుల హింసను ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉపేక్షించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శనివారం ఆయన ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు సీఎంకు వెల్లడించినట్లు సమాచారం. ఇక భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంజాబ్‌లో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది. లాఠీఛార్జీ, కాల్పులు లాంటివి చోటు చేసుకోలేదు. ఎవరూ చనిపోలేదు కూడా. అని అమరీందర్ తెలిపారు. పంజాబ్‌లో హింసకు తావు ఇవ్వబోమని ఆయన ప్రకటించారు. తీర్పు నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేయకుండా పంచకులలోకి గుర్మీత్ అనుచరులను అనుమతించటం హర్యానా ప్రభుత్వం చేసిన తప్పుగా ఆయన పేర్కొన్నారు. కర్ఫ్యూను నిన్న రాత్రికే పాక్షికంగా సడలించామని తెలిపిన ఆయన ఈరోజు మరోసారి సమీక్షించిన అనంతరం పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు. డేరా ప్రధానకార్యాలయంలోకి వెళ్లం: ఆర్మీ డేరా సచ్ఛా సౌదా ఆశ్రమం ప్రధాన కార్యాలయంలోకి సైన్యం ప్రవేశించబోతుందన్న వార్తలపై ఆర్మీ వర్గాలు స్పందించాయి. అలా ప్రయత్నమేం చేయబోవట్లేదని హిసర్ 33వ విభాగం జీవోసీ అధికారి రాజ్‌పాల్ పునియా స్ఫష్టం చేశారు. హర్యానాలోని సిస్రా లో సుమారు 700 ఎకరాల్లో డేరా ప్రధాన కార్యాలయం విస్తరించి ఉంది. కురుక్షేత్ర, మన్సా డేరా ఆశ్రమంలో సుమారు 12 మందికి పైగా డేరా అనుచరులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.