తప్పంతా హర్యానా ప్రభుత్వానిదే: పంజాబ్ సీఎం
ఛండీగఢ్; డేరా అనుచరుల హింసను ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉపేక్షించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శనివారం ఆయన ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు సీఎంకు వెల్లడించినట్లు సమాచారం.
ఇక భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంజాబ్‌లో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది. లాఠీఛార్జీ, కాల్పులు లాంటివి చోటు చేసుకోలేదు. ఎవరూ చనిపోలేదు కూడా. అని అమరీందర్ తెలిపారు. పంజాబ్‌లో హింసకు తావు ఇవ్వబోమని ఆయన ప్రకటించారు. తీర్పు నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేయకుండా పంచకులలోకి గుర్మీత్ అనుచరులను అనుమతించటం హర్యానా ప్రభుత్వం చేసిన తప్పుగా ఆయన పేర్కొన్నారు.
కర్ఫ్యూను నిన్న రాత్రికే పాక్షికంగా సడలించామని తెలిపిన ఆయన ఈరోజు మరోసారి సమీక్షించిన అనంతరం పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు.
డేరా ప్రధానకార్యాలయంలోకి వెళ్లం: ఆర్మీ
డేరా సచ్ఛా సౌదా ఆశ్రమం ప్రధాన కార్యాలయంలోకి సైన్యం ప్రవేశించబోతుందన్న వార్తలపై ఆర్మీ వర్గాలు స్పందించాయి. అలా ప్రయత్నమేం చేయబోవట్లేదని హిసర్ 33వ విభాగం జీవోసీ అధికారి రాజ్‌పాల్ పునియా స్ఫష్టం చేశారు. హర్యానాలోని సిస్రా లో సుమారు 700 ఎకరాల్లో డేరా ప్రధాన కార్యాలయం విస్తరించి ఉంది. కురుక్షేత్ర, మన్సా డేరా ఆశ్రమంలో సుమారు 12 మందికి పైగా డేరా అనుచరులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.