ముఖ్యమంత్రి సరికొత్త రికార్డు!
పంజాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా ఒక్కసారి కూడా అసెంబ్లీకి హాజరు కాని అమరీందర్.. ఇప్పుడు మాత్రం గత నాలుగు రోజులుగా అసెంబ్లీ జరిగినంత సేపూ సభలోనే ఉన్నారు! ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో అసెంబ్లీకి, లోక్‌సభకు హాజరు కాలేదన్న విమర్శలు ఆయనపై ఉండేవి. బుధవారం నాడు వాయిదా తీర్మానంపై అసెంబ్లీలో 45 నిమిషాలు పాటు చర్చ జరిగింది. అంతసేపూ కెప్టెన్ సభలోనే కూర్చుని ఉన్నారు. 2015 నవంబర్‌లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దాదాపు ఏడాది పాటు ప్రచార పర్వంలో మునిగి తేలిన అమరీందర్.. అప్పుడిచ్చిన హామీలను నెరవేర్చుకోవడం ఎలా అని మధనపడుతూ సభలోనే కాలం గడుపుతున్నారంటున్నారు.
బుధవారం నాడు అసెంబ్లీకి వెళ్లిన సీఎం.. అక్కడి ప్రెస్ గ్యాలరీ వద్దకు కూడా వెళ్లి మీడియా ప్రతినిధులను కలిశారు. రైతులు తనఖా పెట్టిన భూములకు స్వాధీన నోటీసులు వస్తున్నాయంటూ వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ఏవైనా వివరణలు కావాలంటే తన మీడియా సలహాదారును సంప్రదించాలని కోరారు. కవేలం తమకు అనుకూలంగా వార్తలు రాసేవాళ్లకే తాను అందుబాటులో ఉంటానని ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పారు.
ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అమరీందర్‌కు, ఇప్పటి సీఎం అమరీందర్‌కు చాలా తేడా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడిందని, తమకు కుదురుకోడానికి కాస్త సమయం ఇవ్వాలని మీడియాను కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయన డ్రగ్స్ భూతాన్ని తరిమేస్తానని, రైతు రుణాలు మాఫీ చేస్తానని, వీఐపీ సంస్కృతిని అంతం చేస్తానని.. ఇలా చాలా హామీలు ఇచ్చారు. వాటిని ఆయన మర్చిపోయినా మీడియా, ప్రజలు మాత్రం మర్చిపోయే పరిస్థితి లేదు.