ఆ సీఎంను ఎలా హతమార్చామో తెలుసు కదా..!
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపేస్తామంటూ కెనడాలో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ మేరకు వరుసపెట్టి ఆడియో రికార్డింగులు ఆయనకు పంపినట్లు తెలుస్తోంది. ''కెప్టెన్, మీ పార్టీ నుంచే బియాంత్ అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవారు.. అతడి అంత్యక్రియలు చేయడానికి మృతదేహం ముక్కలు ఏరుకోవాల్సి వచ్చింది'' అని గట్టిగా అరుస్తూ ఒక హెచ్చరికను రికార్డు చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను ఖలిస్తాన్ ఉగ్రవాదులు కారుబాంబుతో చంపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే చంపేస్తామంటూ కెప్టెన్ అమరీందర్‌నూ హెచ్చరిస్తున్నారు. అయితే, వాటిని తాను ఏమాత్రం పట్టించుకునేది లేదని కెప్టెన్ అంటున్నారు. వాళ్లు కెనడాలో తలలు పగిలేలా అరుచుకున్నా తాను మాత్రం కొంచెం కూడా పట్టించుకోనని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం, పంజాబ్ కూడా సుస్థిరంగా, బలంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని, రాష్ట్రం సుస్థిరంగా ఉంటే తాను అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టగలనని అన్నారు.
కెనడాలో ఉంటున్న కొందరు ఖలిస్తాన్ ఉగ్రవాదులు కేవలం పంజాబ్ ముఖ్యమంత్రినే కాక.. మాజీ డీజీపీ కేపీఎస్ గిల్‌ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేశారంటూ గిల్‌కు అప్పట్లో చాలా మంచిపేరు వచ్చింది. కెనడాలో ఏదో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ.. ఆ సందర్భంగానే ఈ ఆడియో మెసేజ్‌లు రికార్డు చేసినట్లుగా వెనకాల శబ్దాలను బట్టి తెలుస్తోంది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన కెనడా రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్ పేరు కూడా ఆ ఆడియో సందేశాల్లో వినిపించింది. ఆయన ఖలిస్తానీ ఉద్యమానికి సానుభూతిపరుడన్న ఉద్దేశంతో సజ్జన్‌ను కలిసేందుకు అమరీందర్ నిరాకరించారు. అయితే.. ఆయనకు తగిన భద్రత మాత్రం కల్పించారు.
''నువ్వు మా రక్షణ మంత్రిని ఉగ్రవాది అన్నావు. నువ్వు సిక్కులను అవమానించావు. ఈ గడ్డ మీద నుంచి నిన్ను చాలెంజ్ చేస్తున్నాం. నీకు ఏ రేంజిలో స్వాగతం పలుకుతామంటే.. ఎప్పుడూ ఇక సిక్కులతో పెట్టుకోవు. నువ్వు సిక్కులందరినీ రెచ్చగొట్టావు. దమ్ముంటే కెనడా రమ్మని సవాలు చేస్తున్నాం'' అని మరో ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు.