నవ దంపతుల్ని నరికి చంపారు.. | Honor Killing in Tamil Nadu | Sakshi
Sakshi News home page

పరువు కోసం ప్రాణాలు తీశారు

Published Fri, Jul 5 2019 7:14 AM | Last Updated on Fri, Jul 5 2019 8:59 AM

Honor Killing in Tamil Nadu - Sakshi

పోలీసుస్టేషన్‌లో ప్రేమజంట పెళ్లి దృశ్యం (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకే చోట చేస్తున్న ఉద్యోగం వారిద్దరినీ స్నేహితుల్లా చేతులు కలిపింది. క్రమేణా మనసులు కూడా కలవడంతో ప్రేమికులుగా మారారు. కులమతజాతి భేదాలను పక్కనపెట్టి ఐదేళ్లపాటూ ప్రేమను పెంచుకున్నారు. ఒకరికొకరు పంచుకున్నారు. మూడునెలల క్రితం మూడుముళ్లతో ఆ ఇద్దరూ ఒకటయ్యారు. అయితే ఐదేళ్ల ప్రేమ, మూడు ముళ్ల బంధాన్ని కులోన్మాద కర్కశులు నిర్ధాక్షిణ్యంగా తెంచేశారు. పసుపు పారాణి ఇంకా ఆరిందోలేదో.. నవ దంపతులను నరికి చంపేశారు. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.          

తూత్తుకూడి జిల్లా కుళత్తూరు పెరియార్‌ నగర్‌ కాలనీకి చెందిన ముత్తుమారికి శోలైరాజ్‌ (23) సమీపంలోని ప్రైవేటు ఉప్పు తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. కుమార్తె శోలైరతి (19) కోవిల్‌పట్టిలోని ఒక మిల్లులో ఉద్యోగం చేస్తోంది. శోలైరాజ్‌ పనిచేస్తున్న ఉప్పు తయారీ కేంద్రంలో కుళత్తూరుకు చెందిన జ్యోతి (20) అనే యువతితో కూడా పనిచేస్తోంది.ఒకేచోట పని కారణంగా ఇద్దరి మధ్య సహజంగానే పరిచయం ఏర్పడింది. క్రమేణా ఈ పరిచయంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గాలకు చెందిన వారుకావడంతో గత ఐదేళ్లుగా తమ ప్రేమను పంచుకుంటూ, పెంచుకుంటూ వస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబాల వారికి తెలియడంతో తీవ్రంగా ఖండించారు. సామాజిక వర్గం ఒకటే అయినా తెగవేరని తెలుస్తోంది. వేర్వేరు తెగలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమను అనుమతించేది లేదని పెద్దలు తేల్చిచెప్పారు.

అయినా వారిద్దరూ తమ ప్రేమను కొనసాగించారు. ఒక దశలో పెద్దలు వీరి ప్రేమకు తీవ్రంగా అడ్డుపడటంతో మూడునెలల క్రితం స్నేహితులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి చర్చలు జరిపగా ఇరు కుటుంబీకులు ససేమిరా అన్నారు. యువతీ యువకులు మేజర్లు, చట్టపరంగా వారి ప్రేమ, పెళ్లి అడ్డుకునే హక్కు లేదని పోలీసులు పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే యువతీ యువకుని తల్లిదండ్రులు ఎంతకూ అంగీకరించకపోవడంతో పోలీసులే వారిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి తరువాత శోలైరాజన్‌ కుటుంబీకులు కొంత దిగివచ్చినా జ్యోతి తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసుల సాక్షిగా పెళ్లి చేసుకున్న జంట పెరియార్‌ నగర్‌లోనే వేరుగా కాపురం పెట్టి కలిసి జీవించసాగారు. బుధవారం రాత్రి భోజనాలు ముగిసిన తరువాత దంపతులిద్దరూ గాలి కోసం ఆరుబయట చాపవేసుకుని నిద్రించారు. గురువారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు గోడదూకి లోనికి ప్రవేశించి కత్తులు, వేటకొడవళ్లతో దంపతులపై విచక్షణారహితంగా దాడిచేశారు.

ఈ దాడిలో ఇద్దరి గొంతుకలు తెగిపోయి, చేతులు ముక్కలై తీవ్రమైన రక్తస్రావం కావడంతో విలవిల కొట్టుకుంటూ దంపతులు శోలైరాజన్, జ్యోతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. దంపతుల దారుణహత్య ఉదంతం తెల్లారేసరకి గ్రామమంతా పొక్కడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి ప్రజలు, శోలైరాజన్‌ బంధువులు పోలీసులను అడ్డుకుని నిందితులను అరెస్ట్‌ చేసేవరకు శవాలను తరలించరాదని ఆందోళనకు దిగారు. పోలీసులు చర్చలు జరిపి నిందితులను వెంటనే అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో శవాలను పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి ప్రేమ వివాహానికి అబ్బాయి వైపువారు అంగీకరించినా అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో ఇది పరువు హత్యగా భావిస్తూ ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, యువతి తండ్రిని పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement