
మృతురాలు లక్ష్మీదేవి
ఆళ్లగడ్డ: ఇంటి నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్న ఓ మైనర్ బాలికను పరువు హత్య పేరుతో ఆమె కుటుంబమే అంతమొందించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీనరసయ్య, లక్ష్మీ దంపతుల కుమార్తె లక్ష్మీదేవి (17), అదే ఊరికి చెందిన చాకలి నాగేంద్ర ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్పారు. దీన్ని లక్ష్మీదేవి తల్లిదండ్రులు వ్యతిరేకించటంతో రెండు వారాల క్రితం ఇద్దరూ గ్రామ నుంచి పారిపోయి ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు దీనిపై ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం పోలీసులు ఈ జంటను స్టేషన్‌కు తెచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరం కలిసే ఉంటామని, లేదంటే కలిసే మరణిస్తామని చెప్పటంతో రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మైనర్‌ని పెళ్లాడినందుకు ఆమె భర్త జైలు పాలవుతాడని లక్ష్మీదేవిని హెచ్చరించారు. మేజర్ కాగానే అందరి సమక్షంలో ఘనంగా వివాహం చేస్తామని హామీ ఇవ్వటంతో లక్ష్మీదేవి శనివారం రాత్రి తల్లిదండ్రులతో కలసి ఇంటికి వెళ్లింది. అయితే మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని ఏటి ఒడ్డున శవంగా కనిపించింది. మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తమ కుమార్తె ఉరివేసుకున్నట్లు లక్ష్మీదేవి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే అటువంటి ఆనవాళ్లు లేకపోగా నుదిటికి గాయం ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు లక్ష్మీదేవి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment