బుచ్చయ్య, వంశీ హాస్పిటల్ పత్రాలు ( ఇన్‌సెట్‌లో) బుచ్చయ్యకు ఆపరేషన్ చేసిన భాగం
వంగూరు (కల్వకుర్తి) : అమాయకత్వం.. నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు ఏ కంగా చికిత్స కోసం వచ్చిన రోగి దగ్గర కిడ్నీ స్వా హా చేసిన సంఘటన ఇది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని ఉమ్మాపూర్‌కు చెందిన బుచ్చయ్య 2008లో తీవ్ర కడుపునొప్పి బాధకు గురయ్యాడు. అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో స్థానిక ఆర్‌ఎంపీ జిలాని వద్దకు వెళ్లాడు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న వంశీ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడంతో బాధితుడు అంగీకరించాడు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు కిడ్నీలో ఉన్న రాయిని తీసి చూపించారు.
నెలరోజుల నుంచి నొప్పితో..
పదేళ్లపాటు ఆరోగ్యంగా ఉన్న బుచ్చయ్యకు గత నెలరోజులనుంచి కడుపునొప్పి, కిడ్నీ భాగంలో లాగడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రులకు వెళ్లి పరీక్ష చేయించగా.. ఒకే కిడ్నీ ఉందని మరో కిడ్నీని ఎప్పుడో తీశారని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అవాక్కైన బుచ్చయ్య గ్రామపెద్దలతో కలిసి ఆర్‌ఎంపీ జిలానీని నిలదీశాడు. అయితే తనకేమీ తెలియదని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. వారు వంగూరు పోలీసులను ఆశ్రయించాలని సూచించినట్లు తెలిసింది.
మాట మాత్రమైనా చెప్పలేదు..
నా భర్త కడుపునొప్పితో బాధపడితే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు రూ.85 వే లు ఖర్చవుతుందని చెప్పి ఆర్‌ఎంపీ జిలాని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఫీజు మొత్తం చెల్లించాం. ఆపరేషన్ అనంతరం కేవలం రాయి మాత్రమే చూపించారు. కిడ్నీ తీసినట్లు మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నిలదీస్తే కిడ్నీ చెడిపోవడం వల్ల తొలగించారని, తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడని బాధితుడు బుచ్చయ్య భార్య పార్వతమ్మ వాపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు తమకు న్యాయం చేయాలని వేడుకుంది. అయితే ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ఆర్‌ఎంపీ జిలానీతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ ఆయన ఆందుబాటులో లేకుండా పోయారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment