కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’ | Hospital Seized in Keerthi Abortion Case Amangal | Sakshi
Sakshi News home page

ట్విస్ట్‌ థ్రిల్లర్‌!

Published Sat, Nov 2 2019 8:10 AM | Last Updated on Sat, Nov 2 2019 8:55 AM

Hospital Seized in Keerthi Abortion Case Amangal - Sakshi

పద్మ నర్సింగ్‌హోమ్‌ను సీజ్‌ చేస్తున్న రంగారెడ్డిడీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంసృష్టించిన తల్లిని చంపిన తనయ కేసులో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు వారం రోజుల క్రితం మిస్సింగ్‌ కేసుగా నమోదై... ఆ తర్వాత మలుపులు తిరుగుతూ మూడు కేసులుగా మారిందీ వ్యవహారం. వీటిలోని ఒక్కో కేసులో కీర్తి ‘పాత్ర’ ఒక్కో రకంగా ఉంది.మొత్తమ్మీద అక్టోబర్‌ 26న రాత్రి 8గంటలకు ఫిర్యాదు దారుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన కీర్తి... ఆపై అనుమానితురాలిగా, నిందితురాలిగా మారి బాధితురాలిగానూ ‘అవతారం’ ఎత్తింది.

తొలుత ఫిర్యాది  
బాయ్‌ఫ్రెండ్‌ శశికుమార్‌ ప్రోద్బలంతో కీర్తి అక్టోబర్‌ 19న  తల్లి రజితను హత్య చేసింది. 22 వరకు శవాన్ని ఇంట్లోనే ఉంచి, ఆపై శశితో కలిసి రామన్నపేటకు తీసుకెళ్లి అక్కడి రైలు పట్టాలపై పడేసింది. తన తండ్రి వేధింపుల నేపథ్యంలోనే తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ 26న రాత్రి 8గంటలకు హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నెం.643/2019గా నమోదైన ఈ మిస్సింగ్‌ కేసులో కీర్తి ఫిర్యాదిగా, ఆమె తల్లి రజిత పేరు బాధితురాలిగా ఉంది.  

ఆపై అనుమానితురాలు
ఈ మిస్సింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా కీర్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డినీ పోలీసులు ప్రశ్నించారు. వైజాగ్‌ టూర్‌ అంటూ చెప్పిన కుమార్తె వ్యవహారశైలిని తండ్రి అనుమానించారు. బంధువులతో కలిసి కీర్తిని నిలదీయగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తన ఫిర్యాదుతో నమోదైన మిస్సింగ్‌ కేసులో కీర్తి అనుమానితురాలిగా మారింది. పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో, లోతుగా విచారించడంతో పాటు పూర్వాపరాలు ఆరా తీశారు. ఆమె కదలికలు, కమ్యూనికేషన్‌కు సం బంధించి సాంకేతిక ఆధారాలను సేకరించారు.  

నిజం బయటపడి నిందితురాలు  
హయత్‌నగర్‌ పోలీసులు కీర్తిని విచారించడం, ప్రాథమిక ఆధారాలు సేకరించడం, క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేయడంతో అసలు విషయం గుర్తించారు. దీంతో మిస్సింగ్‌ కేసును మర్డర్‌ కేసుగా మార్చారు. దీంతో అప్పటి వరకు ఫిర్యాదిగా ఉన్న కీర్తి అదే కేసులో శశితో కలిసి నిందితురాలిగా మారింది. కీర్తి తండ్రి
శ్రీనివాస్‌రెడ్డి ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా చేరారు. ఈ మర్డర్‌ కేసులోనే పోలీసులు కీర్తి, శశిలను అరెస్టు చేశారు. హత్యతో పాటు సంయుక్తంగా ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణ చేర్చారు. 

మరో రెండు కేసుల్లో బాధితురాలు   
రజిత హత్య జరగడానికి కారణాలు, దాని పూర్వాపరాలు తెలుసుకున్న హయత్‌నగర్‌ పోలీసులు మరో రెండు దారుణాలను గుర్తించారు. కీర్తి మైనర్‌గా ఉన్నప్పుడే బాల్‌రెడ్డితో పాటు శశికుమార్‌ ఆమెపై అత్యాచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి దారుణాలపై సమాచారం ఉంటే పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలనే నిబంధన ఉంది. దీంతో హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ ఫిర్యాదిగా మారారు. ఆయన ఫిర్యాదుతో సుమోటోగా రెండు పోక్సో యాక్ట్‌ (మైనర్‌పై అత్యాచారానికి సంబంధించి) కేసులు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌ నెం.659/2019, 660/2019లతో నమోదైన వీటిలో కీర్తి బాధితురాలిగా ఉంది. వీటిలో మొదటి కేసులో బాల్‌రెడ్డిని, రెండో దాంట్లో శశిని అరెస్టు చేశారు.  

ఆమన్‌గల్లుకూ ప్రకంపనలు
ఈ కేసుల ప్రకంపనలు పొరుగున ఉన్న ఆమన్‌గల్లును తాకాయి. మైనర్‌గా ఉన్న కీర్తిని గర్భవతిని చేసిన బాల్‌రెడ్డి అప్పట్లో అబార్షన్‌ చేయించాడు. శశికుమార్‌తో కలిసి కారులో ఆమన్‌గల్లులోని పద్మ నర్సింగ్‌ హోమ్‌లో ఈ చట్ట విరుద్ధమైన పని జరిగింది. ఈ విషయం హయత్‌నగర్‌ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకివచ్చింది. దీంతో పోలీసులు ఆ ఆస్పత్రి నిర్వాహకులనూ నిందితులుగా చేర్చడానికి నిర్ణయించారు. దీనిపై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఆ ఆసుపత్రిపై దాడి చేసి సీజ్‌ చేశారు.   



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement