![House Owner Money Bag Missing In Scrap Cover Rajendranagar - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/3/scrap-bag.jpg.webp?itok=0StnfTyC)
రాజేంద్రనగర్: ఇంట్లో చెత్త నింపిన ప్లాస్టిక్ బ్యాగ్ బదులు, నగదు బ్యాగ్‌ను ఇంటి యజమాని వాచ్‌మెన్‌కు అందించాడు. దాన్ని ఆ వాచ్‌మెన్ చెత్త సేకరణదారుడికి అందించాడు. అందులో రూ. 6 లక్షలు ఉన్నాయంటూ ఆ యజమాని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చెత్త లారీతో పాటు చెత్తనంతా వెతికినా డబ్బు మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీసులు చెత్త సేకరిస్తున్న కార్మికుడితో పాటు వాచ్‌మెన్‌ను విచారిస్తున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాధాకృష్ణానగర్ ప్రాంతంలో డి.యాదగిరి ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరిస్తుంటాడు. ఆటోలో సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలిస్తాడు.
కాలనీకి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యజమాని ఆరు లక్షల నగదును ప్లాస్టిక్ కవర్‌లో తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. శుక్రవారం ఉదయం చెత్త కోసం వచ్చిన కార్మికుడికి ఇంట్లోని వారు ఆ బ్యాగును కాస్తా చెత్త బ్యాగ్ అనుకొని వాచ్‌మెన్‌కు అందజేశారు. వాచ్‌మెన్ బ్యాగ్‌ను చెత్త తరలించే వాహనంలో వేశాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నగదు ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించకపోవడంతో ఇంట్లో వెతకగా బ్యాగ్‌కు బదులు, చెత్త బ్యాగ్ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులను ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో వెంటనే ఆ ఇంటి యజమాని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. పోలీసులు చెత్త సేకరిస్తున్న యాదగిరి డంపింగ్ యార్డు వద్ద పట్టుకొని తనిఖీ చేశారు. ఆటోతో పాటు అప్పుడే చెత్తను తరలిస్తున్న లారీని పూర్తిగా వెతికారు. అయినా డబ్బు బ్యాగ్ కనిపించలేదు. దీంతో యాదగిరితో పాటు వాన్‌మెన్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు.
కార్మికుడిని వేధించడం సరైంది కాదు: రుద్రకుమార్
చెత్త సేకరించే కార్మికుడు యాదగిరిని రాజేంద్రనగర్ పోలీసులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు స్టేషన్‌లో వేధించడం సరైంది కాదని బీఎల్‌ఎఫ్ నాయకుడు రుద్రకుమార్‌యాదవ్ అన్నారు. రూ. 6 లక్షల డబ్బును ఎవరైనా చెత్త వేసే ప్రాంతంలో భద్రపరుస్తారా అని ప్రశ్నించారు. కార్మికుడిని వెంటనే వదిలివేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment