సాక్షి, ఒంగోలు : అర్ధరాత్రి పేర్నమిట్ట పంచాయతీ పరిధిలోని పీర్లమాన్యంలో ఆకుల ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో గృహ చోరీ చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం పీర్లమాన్యంలోని ప్రసాద్ నివాసం ఉండే ప్రాంతంలో మున్సిపల్ వాటర్ అర్ధరాత్రి దాటిన తరువాత 1 గంటల సమయంలో విడుదల చేస్తారు. అయితే రాత్రి ఒంటిగంట దాటినా నీరు రాకపోవడంతో ప్రసాద్ భార్య ఇంట్లో పడుకోగా, బయట వైపు గడియ వేసి కుటుంబ సభ్యులు మంచాలు వేసుకుని పడుకున్నారు. అందరు నిద్రపోవడాన్ని గమనించిన యువకుడు తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించాడు.
లోపల బీరువా తాళాలు అందుబాటులో ఉండడంతో బీరువా తెరిచి అందులో ఉన్న నగదు, బంగారం తీసుకుని ఉడాయించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ప్రసాద్ భార్యకు మెళకువ వచ్చింది. ఆమె వెంటనే దొంగను పట్టుకునేందుకు యత్నించగా ఆమెను నెట్టేసి పారిపోయాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఇంటి బయట పడుకున్న కుటుంబ సభ్యులు నిద్రలేచే సమయానికి దొంగ పారిపోవడంతో వారు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించాడు.
వెంటనే సీసీ పుటేజి ఆధారంగా నిందితుడి ఫోటోను అన్ని పోలీసు స్టేషన్లకు పంపారు. అయితే నిందితుడు పాత నేరస్తుడు కావడంతో నిందితుడు పేర్నమిట్టకు చెందిన రాహుల్‌గా గుర్తించారు. దీంతో అతనిని పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించి సొత్తును కూడా పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన వెంటనే సత్వరమే నిందితున్ని పట్టుకోగలమనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment