వేదాద్రి (జగ్గయ్యపేట): మద్యం మత్తు మృత్యు రూపం దాల్చింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న రెండు రైతు కుటుంబాలకు చెందిన 12 మందిని కాటేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో లారీ డ్రైవర్ సహా మరో 12 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఏటా వ్యవసాయ పనులు చేపట్టే ముందు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా జమలాపురం, కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామాలకు చెందిన బంధువుల్ని నాలుగు రోజుల క్రితం గోపిరెడ్డి తన ఇంటికి ఆహ్వానించాడు. మొక్కు తీర్చుకునేందుకు 25 మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్టర్‌పై పెద్ద గోపవరం నుంచి బయలుదేరి మధిర మీదుగా వత్సవాయి మండలం తాళ్లూరు చెక్‌పోస్టు, పెనుగంచిప్రోలు మండలం మీదుగా వేదాద్రికి రాత్రి 10 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ రాత్రి ఆలయ పరిసరాల్లో బసచేసి బుధవారం ఉదయం కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో అంతా కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోనే వండుకుని భోజనాలు చేశారు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అదే ట్రాక్టర్‌పై తిరుగు ప్రయాణమయ్యారు.
ప్రమాద స్థలంలో మృతదేహాలను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, తదితరులు
ఆ లారీ మృత్యు శకటమై..
వారంతా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ సరిగ్గా ఆలయం నుంచి అర కిలోమీటర్ దూరం ప్రయాణించే సరికి ఎదురుగా హేమాద్రి సిమెంట్స్ కర్మాగారం నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ట్రాక్టర్ ఇంజన్‌ను ఢీకొట్టి దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ట్రక్కులో ఉన్నవారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా.. పెద్దగోపవరానికి చెందిన వేమిరెడ్డి ఉదయశ్రీ (7), వేమిరెడ్డి పుల్లారెడ్డి (75), వేమిరెడ్డి పద్మావతి (50), వేమిరెడ్డి రాజేశ్వరి (27), జమలాపురానికి చెందిన వెదురు అప్పమ్మ (60), కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జయంతికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి (65), గూడూరు ఉపేంద్రరెడ్డి (14) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలిస్తుండగా.. వేమిరెడ్డి భారతమ్మ (65), లక్కిరెడ్డి తిరుపతమ్మ (70), గూడూరు రమణమ్మ (60) మార్గమధ్యంలో మరణించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దగోపరానికి చెందిన వేమిరెడ్డి కల్యాణి (16), వేమిరెడ్డి లక్ష్మి (9) మృత్యువాతపడ్డారు.
గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి
వేదాద్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతులంతా బంధువులే..
మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన బంధువులే. రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుమార్తె ఉదయశ్రీ,, అతడి తాత పుల్లారెడ్డి, బామ్మ భారతమ్మ, నాయనమ్మ పద్మావతి మృత్యువాత పడగా.. మరో రైతు కుటుంబానికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి, రమణమ్మ భార్యాభర్తలు. మృతుల్లో వారి మనుమడు ఉపేంద్రరెడ్డి కూడా ఉన్నాడు. మిగిలిన ఐదుగురూ ఈ రెండు కుటుంబాల వారికి బంధువులు.
క్షతగాత్రుల వివరాలివీ..
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో గూడూరు శివనాగిరెడ్డి, అరుణ, నరసింహారెడ్డి, భార్గవి, వేమిరెడ్డి లావణ్య, భానుశ్రీ, శీలం లక్ష్మి, లక్కిరెడ్డి రవీంద్రారెడ్డి, ధనలక్ష్మి, ప్రియాంక, కాలపాని వీర్రాజు, ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ శివసుబ్రమణి ఉన్నారు. వీరిని 108, పోలీస్ వాహనాల్లో జగ్గయ్యపేట, ఖమ్మం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ట్రాక్టర్ నడిపిన రైతు గోపిరెడ్డి, గూడూరు తిరుమలరెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు.
మద్యం మత్తులో లారీ నడపడం వల్లే..
లారీ డ్రైవర్ శివసుబ్రమణి అతిగా మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హేమాద్రి సిమెంట్స్ కర్మాగారానికి బొగ్గును లారీలో తీసుకొచ్చిన అతడు.. కర్మాగారంలో సగం బొగ్గును అన్‌లోడ్ చేసిన తరువాత మిగిలిన బొగ్గుతో మద్యం మత్తులో లారీ నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. లారీని అడ్డదిడ్డంగా నడుపుతూ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడని తెలిపారు. ప్రమాదం అనంతరం లారీ సమీపంలోని కాలువలోకి దూసుకెళ్లి గోతిలో దిగబడిపోగా.. డ్రైవర్ రెండు కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి.
ఇలా జరిగింది..
వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ట్రాక్టర్ ఇంజన్‌ను ఢీకొట్టి.. దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ఆ తరువాత రోడ్డు పక్కన గల కాలువలోకి దూసుకెళ్లి గుంతలో దిగబడింది.
ఎప్పుడు.. ఎక్కడ..
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
పర్యవసానం
డ్రైవర్ పూటుగా మద్యం తాగి తానెటు వెళ్తున్నానో తెలియని స్థితిలో లారీ నడపటం వల్ల దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ సహా మరో 12 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment