
మారెన్న, విశాలాక్షిల పెళ్లి ఫొటో
భార్యను హతమార్చి.. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
అనంతపురం, ఉరవకొండ రూరల్: వ్యాసాపురంలో భార్య హత్య.. భర్త ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వ్యాసాపురం గ్రామానికి చెందిన మారెన్న (30), విశాలాక్షి (25)లకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు వంశీ, ఏడాది వయసు గల కుమార్తె హేమాంజలి ఉన్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవ పడుతుండేవారు.
కుటుంబ సమస్యలపై వాదులాడుకుంటున్నారేమో అని అందరూ భావించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటాక.. నిద్రలో ఉన్న విశాలాక్షిపై భర్త మారెన్న గొడ్డలితో విరుచుకుపడ్డాడు. చెంపపైన, చేతిపైన నరికాడు. అలికిడికి ఇంటి పక్కనున్న కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మారెన్న ఉడాయించాడు. అయితే అప్పటికే విశాలాక్షి ప్రాణం విడిచింది. ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ గ్రామానికి వెళ్లి చూసి ప్రజలను విచారించారు. అనుమానంతో భార్యను హత్యచేసి.. తర్వాత తనూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు తెలిపారు.
పాలకోసం తల్లడిల్లి..
పాల కోసం అమ్మ వద్దకు వెళ్తున్న హేమాంజలి (1)ని చూసి అందరూ చలించిపోయారు. ‘ఇంకెక్కడుందమ్మా.. మీ అమ్మ’ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలను హత్తుకుని.. చిన్న వయసులోనే మీకెంత కష్టం వచ్చిందే అంటూ రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment