శివయ్యను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్న పోలీసులు
అనంతపురం, తాడిమర్రి: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు. మూడు రోజులకే అమ్మాయిని వద్దన్నాడు. దీంతో ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్డీఓ కోర్టులో పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రేమికునికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాలని ఆర్డీఓ తిప్పేనాయక్ ఆబ్బాయి తల్లిదండ్రులకు సూచించారు. దగ్గరుండి అబ్బాయి ఇంటిలో వారిద్దరినీ వదిలి రావాలని పోలీసులను ఆదేశించారు. కానీ పోలీసులు ఆ దంపతులను ధర్మవరంలోని ఓ ఇంట్లో వదిలారు. అయితే నెల రోజులు తిరక్కుండానే ప్రేమికుడు పారిపోయాడు. దీంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. మండలంలోని నార్శింపల్లి గ్రామం ఎరికల సామాజిక వర్గానికి చెందిన సాకే ఈరప్ప, లింగమ్మ దంపతుల కుమార్తె సాకే హేమలత ధర్మవరంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తాడిమర్రి మండలం పూలఓబయ్యపల్లి గ్రామం కురబ సామాజిక వర్గానికి చెందిన పాళ్యం ముత్యాలప్ప, పార్వతమ్మల కుమారుడు పాళ్యం శివయ్య కూడా ఆదే కళాశాలలోనే డిగ్రీ చదువుతున్నారు. ఒకే మండలానికి చెందిన వారు కావడంతో ఇద్దరూ స్నేహితులయ్యారు. వారి స్నేహం చివరకు ప్రేమగా మారడంతో డిగ్రీ మూడవ సంవత్సరం చివరి పరీక్ష రోజున (20–03–2019) ఇద్దరూ తిరుపతికి వెళ్లి వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 22న పోలీసులు వారిని పిలిపించారు.
న్యాయం కోసం పోలీసుస్టేషన్ ముందు బైఠాయించిన హేమలత
ఇంతలో ఏమైందో కానీ.. అమ్మాయి అంటే తమకు ఇష్టం లేదని ప్రేమికుడు, అతని బంధువులు పట్టు పట్టారు. దీంతో పోలీసులు వారిని ఆర్డీఓ దగ్గరకు తీసుకెళ్లగా... ఆయన అబ్బాయికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అమ్మాయిని కోడలుగా అంగీకరించాలని పంపారు. ఇద్దరూ ధర్మవరంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తూ పట్టణంలోనే కాపురం పెట్టారు. గత «శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న శివయ్యను అతని సమీప బంధువులు వెంకటరమణ, పూజారి నరసింహులు బయటకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి శివయ్య ఆచూకీ లేదు. దీంతో హేమలత శనివారం తాడిమర్రి పోలీసులను ఆశ్రయించింది. ఎస్‌ఐ శరత్‌చంద్ర శివయ్యను పిలిపించారు. ఇంతలో దాడితోటలో అరటితోట దగ్ధం కావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో శివయ్యను కొందరు టీడీపీ నాయకులు తప్పించారు. దీంతో హేమలత తన బంధువులతో కలసి ఆదివారం పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగింది. సోమవారం సీఐ దగ్గరకు తీసుకెళ్లి న్యాయం చేయిస్తామని ఎస్‌ఐ చెప్పడంతో వారు ధర్నా విరమించి ఇంటికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment