ప్రాణాలు తీసిన అనుమానం | Husband Killed Wife In Anantapur | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన అనుమానం

Published Thu, Dec 27 2018 11:44 AM | Last Updated on Thu, Dec 27 2018 11:44 AM

Husband Killed Wife In Anantapur - Sakshi

వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురయ్యారు.     రెండు చోట్లా కర్రలతో బాది అంతమొందించారు. రెండింటి హత్యల వెనుక ఒకటే కారణం కనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారనే అనుమానంతోనే వారిని కడతేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు ఘటనలతో చుట్టుపక్క ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యారు.  

అనంతపురం, కళ్యాణదుర్గం: బోరంపల్లిలో ఘోరం జరిగింది. వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేసి ఉంటారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన రామాంజినమ్మ కుమార్తె విమలకు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన వెంకటేశులుతో 2009లో వివాహం చేశారు. వీరికి కుమారుడు పూర్ణ, కుమార్తె రీనా ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 1.00 గంట సమయంలో విమల సోదరుడు నరసింహులుకు వెంకటేశులు ఫోన్‌ చేసి ‘మీ అక్క పురుగుల మందు తాగింది రండి’ అంటూ సమాచారం ఇచ్చాడు. ఈ సమయంలో విమల జోక్యం చేసుకుని అదేమీ లేదంటూ ఫోన్‌లో సమాధానం ఇచ్చింది. తిరిగి 1.50గంటలకు విమల సోదరుడు నరసింహులు తల్లి రామాంజినమ్మ వద్దకు వెళ్లి ఫోన్‌లో మాట్లాడించే ప్రయత్నం చేశాడు.

ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆటోలో పుట్టింటికి రమ్మని చెప్పాడు. అదేమీ లేదని విమల స్పష్టం చేసింది. తిరిగి మధ్యాహ్నం 2.24 గంటలకు మరోసారి వెంకటేశులు ఫోన్‌చేసి విమల మందు తాగిందని, తాను నిజమే చెబుతున్నానని పుట్టింటి వారికి చెప్పాడు. అనుమానంతో వారు హుటాహుటిన బోరంపల్లికి బయలుదేరి వచ్చారు. అప్పటికే విమల రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. రోకలి బండతో మోది హతమార్చినట్లు గుర్తించి బోరున విలపిస్తూ బయటకు వచ్చారు. ఘటన అనంతరం భర్త వెంకటేశులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. హత్య సంఘటనపై కుటుంబ సభ్యులు గ్రామంలోని రహదారిపై కొద్ది సేపు ఆందోళన చేపట్టారు. రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ సర్దిచెప్పి వారిని శాంతింపచేశారు. ఇదిలా ఉండగా భార్య విమల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్తే హతమార్చి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతురాలి సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. 

శింగవరంలో మరొకరు..
యల్లనూరు: శింగవరంలో కమ్మర భారతి (36) మంగళవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్లితే... రెండవ భార్య అయిన భారతి వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో భర్త ఆశ్వర్థ ఆచారి, ఆయన మొదటి భార్య కుమారులు ప్రకాశం ఆచారి, మనోహర ఆచారిలు పథకం ప్రకారం నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై కర్రలతో మోది హత్య చేశారు. రక్తపు మరకలను తుడిచేసిన బట్టను కాల్చివేసేశారు. హతురాలి అక్క లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు భారతి భర్త, ఆయన మొదటి భార్య కుమారులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హారున్‌బాషా తెలిపారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement