
రక్తపు మడుగులో మృతురాలు రమణమ్మ , పెళ్లినాటి ఫొటో
పొందూరు: కష్టంలో, సుఖంలో కడవరకు తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్తే కాలయముడయ్యాడు. దయాదాక్షిణ్యాలు లేకుండా భార్యను కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యను అనుమానించి, హింసిస్తూ వస్తున్న భర్త.. చివరకు పథకం ప్రకారం భార్యను కడతేర్చాడు. బాణాం గ్రామంలో ఈ దారుణ సంఘటన బుధవారం జరిగింది. బాణాం గ్రామానికి చెందిన జీరు వెంకటరమణకు ఎచ్చెర్ల మండలంలోని వెంకయ్యపేటకు చెందిన రమణమ్మ(25)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జీరు ఢిల్లీ(5), చిన్నోడు జీరు నాని(3) ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహమైన కొద్ది రోజుల నుంచే అనుమానంతో రమణమ్మను రక్తం వచ్చేలా కొట్టడం, కోసేయడం, చురకలు పెట్టేయడం వంటి చిత్రహింసలు పెట్టేవారు.
ఆ బాధలు తట్టుకోలేక ఏడాది క్రితం పిల్లలను తీసుకొని చీరాలకు కూలి పనికి వెళ్లిపోయింది. వారం రోజుల క్రితం మావయ్య జీరు రామప్పడు చనిపోవడంతో బాణాం తిరిగి వచ్చింది. భర్త కొడతాడనే భయంతో గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉంటోంది. బుధవారం రాత్రి బాణాంలో ఉన్న ఇంటిని శుభ్రం చేయాలని రమణమ్మకు వెంకటరమణ కబురు పంపించాడు. వెళ్లేందుకు కొంత భయపడినా.. తన మేనకోడలితో కలసి ఇంటికి వెళ్లింది. ఇంటికి తాళాలు వేసి బయట ఆమె కోసం వెంకటరమణ వేచి ఉన్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న భార్యను చూసి.. మేన కోడలిని మంచి నీరు తీసుకురావాలని బోరింగు వద్దకు పంపించారు. ఆమె నీరు తెచ్చి చూసే సరికి రమణమ్మను కత్తితో నరికి వెంకటరమణ పరారయ్యాడు. రక్తపు మడుగులో గిలగిలకొట్టుకొంటూ మృతిచెందడాన్ని చూసిన మేనకోడలు అక్కడే స్పృహ కోల్పోయింది. శ్రీకాకుళం డీఎస్పీ బీమారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు. జేఆర్‌పురం సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ బాలరాజు సీఐ వెంట ఉన్నారు.
అనాథలైన పిల్లలు
జీరు రమణమ్మ మృతి చెందడంతో ముక్కుపచ్చలారని ఇద్దరు చంటి పిల్లలు అనాథలయ్యారు. తల్లికి ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment