మృతదేహాన్ని పరిశీలిస్తున్న రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, (ఇన్‌సెట్లో) భానుమతి (ఫైల్) నిందితుడు సాంబశివరావు
అనుమానం పెనుభూతమైంది. ప్రసవం జరిగి 18 రోజులు కూడా నిండని పచ్చి బాలింతను పొట్టన పెట్టుకుంది. పొత్తిళ్లలోని బిడ్డను శాశ్వతంగా అనాధను చేసింది. అసలే అనుమానం.. దీనికి తోడు ఆడపిల్ల పుట్టిందనే కసితో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. పసిబిడ్డ పక్కన నిద్రిస్తున్న భార్య తలపై పదునైన ఆయుధంతో విచక్షణా రహితంగా దాడిచేసి పరారయ్యాడు. వేకువ జామున మనవరాలి ఏడ్పువిని వచ్చి చూసిన మృతురాలి తల్లి రక్తపుమడులో మంచంపై నిర్జీవంగా పడి ఉన్న కుమార్తెను చూసి నిర్ఘాంతపోయింది. ఈ విషాద ఘటనవేటపాలెం మండలంలోని దేశాయిపేట పంచాయతీ నీలకంఠపురం గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రకాశం ,వేటపాలెం: పచ్చని సంసారంలో దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. చివరకు భర్త అనుమానం భార్యను కడతేర్చేలా చేసింది. దంపతుల ప్రేమకు గుర్తుగా పుట్టిన పద్దెనిమిది రోజుల చంటి పాప తల్లి ప్రేమకు శాశ్వతంగా దూరమైంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దేశాయిపేట పంచాయతీ నీలకంఠపురం గ్రామానికి చెందిన అవ్వారు లీలారావు, పద్మావతి దంపతుల మూడో కుమార్తె భానుమతి (21)ని చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన సాధు సాంబశిరావుకు ఇచ్చి గతేడాది అక్టోబర్ 1న వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యపై భర్త అనుమానం పెంచుకుని నిత్యం శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. పెళ్లయిన మూడు నెలల తర్వాత భానుమతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిరింది. మళ్లీ ఆమెపై అనుమానం పెంచుకుని నువ్వు తనకు ఇష్టం లేదంటూ తరుచూ కొట్టేవాడు. సాంబశివరావుకు తల్లి పద్మావతి సహకారం తోడవడంతో మరింత రెచ్చిపోయేవాడు. ఈపూరుపాలెంలో జరిగిన ఆమె సీమంతం వేడుకలో పెద్ద గొడవై విషయం పోలీసుస్టేషన్ వరకూ వెళ్లింది. పెద్దల సమక్షంలో దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ చేశారు.
ప్రసవం కోసం తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. ఎనిమిదో నెలలో ఒకసారి భార్యను చూసి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ వైద్యశాలలో కాన్పుకు వెళ్లినప్పుడు అన్నీ దగ్గర ఉండి చూసుకున్నాడు. పండంటి ఆడ బిడ్డకు భానుమతి జన్మనిచ్చింది. భర్తలో అనుమానం మరింత పెరిగింది. అనుమానంతో పాటు ఆడి బిడ్డ పుట్టడంతో భర్తలో మరింత కసి పెరిగింది. ఈ క్రమంలో గురువారం రాత్రి 12 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై నీలకంఠపురం వచ్చి ఇంటి వెనుక తలుపు వైపుగా భార్యను పిలిచాడు. అత్త తలుపు తీసి అల్లుడిని పలుకరించింది. అనంతరం అత్త, మామ ఇంటి ముందు పంచలో మగ్గం వద్ద పడుకున్నారు. సాంబశివరావు కొద్దిసేపు భార్యతో మాట్లాడాడు. బయట ఉన్న అత్తమామలు, భార్య భానుమతి నిద్రపోయారని నిర్ధారించుకున్నాడు. పదునైన ఆయుధంతో భార్య ముఖంపై చాలాచోట్ల పొడిచి బైకుపై పారిపోయాడు. తెల్లవారే వరకూ విషయం ఎవరికీ తెలియదు.
శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో చిన్నారి ఏడుపు వినిపిస్తుండటంతో భానుమతి తల్లి వచ్చి చూసింది. రక్తపు మడుగులో కుమార్తె నిర్జీవంగా ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. పచ్చి బాలింతను హత్య చేయడం, రోజుల పాప తల్లి ప్రేమకు దూరం కావడం పలువురు మహిళల హృదయాలను కలచి వేసింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వేటపాలెం ఎస్‌ఐ వెంకటకృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. నిందితుడు, అతడి కుటుంబ సభ్యులను ఈపూరుపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment