
టీ.నగర్: ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన భర్త భార్యపై కత్తితో దాడి చేసి అనంతరం తానూ చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరువురూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చెన్నై అరుంబాక్కంలో సోమవారం చోటుచేసుకుంది. అరుంబాక్కం తిరువీధియమ్మన్ ఆలయ వీధికి చెందిన రమేష్ (44), దేవి (36) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె కోవైలోని స్కూలులో చదువుతోంది.
మరో కుమార్తె చెన్నైలోని స్కూలులో ఏడో తరగతి చదువుతోంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాల కారణంగా ఎనిమిదేళ్లుగా విడిగా జీవిస్తున్నారు. దీంతో రమేష్ మానసిక స్థితి దెబ్బతింది. అదే ప్రాంతంలోని అంబేడ్కర్ నగర్‌లో నివశిస్తున్నాడు. సోమవారం ఉదయం రమేష్ భార్యను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో భార్య వద్దనున్న ఆధార్ కార్డు ఇవ్వమని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన రమేష్ భార్యపై కత్తితో దాడి చేసి తరువాత చేయ్యి నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న అరుంబాక్కం పోలీసులు ఇరువురిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment