భార్య గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం | Husband Try To Kill Wife With Blade In Dharmapuri | Sakshi
Sakshi News home page

భార్య గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం

Published Sat, Aug 17 2019 7:58 AM | Last Updated on Sat, Aug 17 2019 8:20 AM

Husband Try To Kill Wife With Blade In Dharmapuri - Sakshi

సాక్షి, ధర్మపురి : భార్యపై అనుమానంతో బ్లేడ్‌తో గొంతుకోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని గంగాపూర్‌కు చెందిన గోలి ప్రమీల–రాజయ్యల రెండో కూతురు రజిత(అలియాస్‌ జక్కుల లావణ్య)ను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన జక్కుల తిరుపతికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొంతకాలం వరకు బాగానే ఉన్నా తిరుపతి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

ఈ విషయమై గతంలో గొడవలు జరగగా లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం లావణ్య తల్లిగారింటికొచ్చింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు కలుగజేసుకొని దంపతులిద్దరికి కౌన్సెలింగ్‌ చేసి ఒక్కటి చేశారు. వీరికి అక్షిత్‌(6), రిత్విక(3) సంతానం కలిగారు. రాఖీ పండుగ సందర్భంగా దంపతులిద్దరూ తమ పిల్లలతో కలిసి గంగాపూర్‌కు వచ్చారు. లావణ్య చెల్లెలు జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవం కావడంతో ఆమెను చూసి గురువారం సాయంత్రం గంగాపూర్‌కు చేరుకున్నారు.

శుక్రవారం ఉదయం తమ స్వగ్రామం రామక్రిష్ణాపూర్‌కు వెళ్దామని తిరుపతి కోరగా తాను తర్వాత వస్తానని లావణ్య చెప్పడంతో అతను బయలుదేరి వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక తిరిగొచ్చిన తిరుపతి భార్యను దగ్గరికి తీసుకొని వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతుకోశాడు. లావణ్య భర్తను నెట్టివేసి కేకలు వేస్తూ వీధిలోకి పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక సర్పంచ్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో గ్రామస్తులు గుమికూడడంతో బయటకు వచ్చిన తిరుపతి గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గ్రామస్తులు ప్రైవేటు వాహనంలో ఇద్దరిని జగిత్యాలలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉండగా, తీవ్రంగా రక్తస్రావం కావడంతో తిరుపతిని కరీంనగర్‌ తరలించారు. బాధితురాలి తల్లి ప్రమీల ఫిర్యాదుతో ఎస్సై చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement