
సాక్షి, చెన్నై : మద్యం మత్తులో భార్య మీద పెట్రోల్ పోసి ఓ కిరాతక భర్త సజీవ దహనం చేశాడు. చెన్నై వేళచ్చేరి సమీపంలోని మేడవాక్కం రాందాసు నగర్‌కు చెందిన రాజేష్(35), సంధ్య(32) తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి జయ విక్రమ్(8), జయ చరణ్(4) పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా పనికి కూడా వెళ్లకుండా రాజేష్ మద్యానికి బానిస అయ్యాడు. దీంతో సంధ్య కుటుంబ పోషణ కోసం సమీపంలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. తాను పనికి వెళ్లపోగా, ఆమెను కూడా వెళ్లనీయకుండా అడ్డుకునే విధంగా భార్యతో రాజేష్ ప్రతి రోజూ గొడవ పడడంమొదలెట్టాడు. అలాగే, ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేఇంచి ఇంటికి వచ్చిన రాజేష్ భార్యతో గొడవ పడ్డాడు.
అదే సమయంలో రాజేష్ సోదరుడు జయగణేష్ అక్కడికి వచ్చి అన్నయ్యకు నాలుగు మంచి మాటలు ఉపదేశించి వెళ్లాడు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన రాజేష్ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సంధ్య మీద పెట్రోల్‌పోసి నిప్పు పెట్టాడు. ఆమె అరుపులకు పిల్లలు ఆందోళనతో కేకులు పెట్టడం మొదలెట్టారు. దీంతో రాజేష్ ఇంటినుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతడ్ని సంధ్య వదలి పెట్ట లేదు. అతడ్ని వాటేసుకోవడంతో మంటలు ఇద్దరినీ చుట్టుముట్టాయి. పిల్లలు పెడుతున్న కేకల్ని విన్న ఇరుగు పొరుగు వారు అక్కడికి వచ్చేలోపు సంధ్య సజీవ దహనం అయింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న రాజేష్‌ను కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మేడవాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment