సాక్షి, హైదరాబాద్ : క్యూనెట్ స్కామ్‌లో 70 మందిని అరెస్ట్ చేసి వారిపై 38 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి బెంగుళూరులో రూ. 2.7 కోట్ల నగదును సీజ్ చేసినట్లు, క్యూనెట్‌ను ప్రచారం చేసిన సినీ ప్రముఖులకు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యూనెట్ సంస్ధ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసం చేస్తున్నారని, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. క్యూనెట్ కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పెట్టుబడుల్లో వచ్చిన డబ్బుని వాడుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా క్యూనెట్ సంస్థ 5 వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ కేసును లోతుగా విచారించాలని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఆదేశాలు ఇచ్చిందన్నారు. 15 రోజుల క్రితం క్యూనెట్ బాధితుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని, మరో వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్యూనెట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు దేశం దాటి పోకుండా 12 మందిపై లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. కేవలం డబ్బులు వసూలు చేయడమే వీరి పని అని, ఇలాంటి మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. క్యూనెట్‌కు ఎలాంటి రికార్డులు లేవని, రూ.100 విలువ చేసే వస్తువు రూ.1500 కి అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యోగులకు టోకరా వేసిన ముఠా గుట్టు రట్టు
బ్యాంకు ఉద్యోగులను మోసం చేసిన ముఠా గుటు రట్టు అయ్యింది. బ్యాంక్ ఉద్యోగులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురిని అరుణ్, లోకేష్ తోమర్, మోహిత్ కుమార్, మనోజ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. పెద్ద కార్ల షో రూమ్‌లను వేదికగా చేసుకొని దేశ వ్యాప్తంగా భారీ మోసాలు చేస్తూ అనేక మందిని మోసం చేసినట్లు పేర్కొన్నారు. కావున బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సరైన సమాచారం లేకుండా డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదుతోపాటు ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment