ఒకే నంబర్‌తో రెండు సిమ్‌లు.. | Hyderabad Police Notice to Airtel Company in Sim Card Block Scam | Sakshi
Sakshi News home page

ఎలా సాధ్యం?

Published Tue, Jun 16 2020 6:59 AM | Last Updated on Tue, Jun 16 2020 10:50 AM

Hyderabad Police Notice to Airtel Company in Sim Card Block Scam - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరుసగా వెలుగులోకి వచ్చిన సిమ్‌కార్డుల బ్లాక్‌ స్కామ్‌లను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయా వ్యాపారులు వినియోగిస్తున్న సిమ్‌కార్డు సర్వీస్‌ ప్రొవైడర్ల నిర్లక్ష్యం ఉందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరి సిమ్‌కార్డు యాక్టివ్‌గా ఉండగా..దాన్ని బ్లాక్‌ చేసే మరొరికి అదే నెంబర్‌తో సిమ్‌కార్డు జారీ చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఎయిర్‌టెల్‌ సంస్థకు సోమవారం నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువు లోపు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి రికార్డులు సమర్పించాల్సిందిగా వాటిలో ఆదేశించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఈ సిమ్‌బ్లాక్‌స్కామ్‌కు నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారులు బలయ్యారు. ఒకరి ఖాతాల నుంచి రూ.38 లక్షలు, మరొకరి ఖాతాల నుంచి రూ.50 లక్షల్ని సైబర్‌ నేరగాళ్ళు కాజేసిన విషయం విదితమే.

రెండు వారాల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి చెందిన రెండు ఖాతాల నుంచి రూ.38 లక్షలు కాజేసిన ఉదంతం మరువక ముందే... గత గురువారం మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ ఖాతా నుంచి రూ.50 లక్షలు సైబర్‌ నేరగాళ్ళు తమ ఖాతాల్లోకి మళ్ళించేసుకున్నారు. ఈ ఇద్దరు వ్యాపారులు తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఖాతాలకు కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల్లో నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన లావాదేవీలు, వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) సహా ఇతర అలెర్ట్స్‌ కోసం తాము వినియోగిస్తున్న ఎయిర్‌టెల్‌ సంస్థ నెంబర్లను అనుసంధానించారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి ఫోన్‌ హఠాత్తుగా పని చేయలేదు. ఆయన తేరుకునే లోపే రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.38 లక్షలు సైబర్‌ నేరగాళ్ళకు చేరాయి. అమీర్‌పేట వ్యాపారి మాత్రం తన సిమ్‌కార్డు బ్లాక్‌ అయిన విషయం గుర్తించి తన సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన ఎయిర్‌టెల్‌ సంస్థను సంప్రదించారు. (హైదరాబాద్‌ ప్రజలకు ఎయిర్‌టెల్‌ శుభవార్త)

మీ నెంబర్‌తో చెన్నైలో కొత్త సిమ్‌ యాక్టివేట్‌ అయిందని, అందుకే ఇక్కడిది బ్లాక్‌ అయిందంటూ ఆ సంస్థ నుంచి సమాధానం వచ్చింది. అలా ఎందుకు జరిగిందని శ్రీహర్ష ఆరా తీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన తన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే వాటి నుంచి రెండు దఫాల్లో రూ.50 లక్షలు మాయమైనట్లు తేలింది. ఈ రెండు నేరాలు చోటు చేసుకువడానికి వ్యాపారులు వినియోగిస్తున్న నెంబర్‌తోనే మరో సిమ్‌కార్డు జారీ కావడమే కారణమని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఇలా జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్తున్న అధికారులు ఎలా జరిగిందనే దానిపై దృష్టి పెట్టారు. ఏ పత్రాల ఆధారంగా మరో సిమ్‌కార్డు జారీ అయింది? దానికి ప్రామాణికాలు ఏంటి? తదిరాలు తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ విషయాలు తెలిస్తేనే ఈ కేసుల దర్యాప్తు ముందుకు వెళ్ళడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చోటు చేసుకోకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి రికార్డులతో తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్‌టెల్‌ సంస్థకు ఈ రెండు కేసుల్లోనూ వేర్వేరు నోటీసులు జారీ చేశారు. కేసుల దర్యాప్తులో భాగంగా సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎక్కడి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా సైబర్‌ నేరగాళ్ళు ఈ ఖాతాలకు యాక్సస్‌ చేశారనే అంశాన్నీ సాంకేతికంగా ఆరా తీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement