ఆస్మాబేగం బుల్లెట్‌ : ఏ తుపాకీ నుంచి వెలువడింది? | Hyderabad Police Pending on Asma Begum Bullet Case | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌.. సీక్రెట్‌

Published Thu, Feb 27 2020 11:22 AM | Last Updated on Thu, Feb 27 2020 3:45 PM

Hyderabad Police Pending on Asma Begum Bullet Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దోపిడీల కంటే బాడీలీ అఫెన్సులుగా పరిగణించే దాడులు, హత్య, హత్యాయత్నాల దర్యాప్తునకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. అందునా..తుపాకీ వాడిన కేసులను ఆఘమేఘాల మీద కొలిక్కి చేరుస్తూ ఉంటారు. నిమ్స్‌ ఆస్పత్రి కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఆస్మా బేగం కేసులో మాత్రం పోలీసులు ఆ స్థాయి ఆసక్తి చూపట్లేదు. ఆమె శరీరం నుంచి బయటకు తీసిన బుల్లెట్‌ ఏ తుపాకీ నుంచి వెలువడింది? ఆ గన్‌ను కాల్చింది ఎవరు? తదితర అంశాలను వెలికితీయడానికి అవసరమైన స్థాయి ప్రాధాన్యం ఇవ్వట్లేదు. మొదట వారం రోజుల పాటు హడావుడి చేసిన అధికారులు ఆపై మిన్నకుండిపోయారు. ఫలితంగా కేసు కొలిక్కి రాకపోవడం మాట అటుంచితే..ఓ దశలో ఆ యువతి కుటుంబీకులుపోలీసులపైనే నెపం నెట్టే ప్రయత్నాలు చేశారని సమాచారం. 

ఇలా బయటపడిన బుల్లెట్‌...
పాతబస్తీలోని జహనుమ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ కుమార్తె ఆస్మాబేగం కొన్నాళ్లు నడుమునొప్పితో బాధపడింది. వైద్యం కోసం తల్లిదండ్రులతో కలిసి నిమ్స్‌ ఆస్పత్రికి వచ్చింది. తొలుత సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కొన్ని మందులు ఇచ్చి పంపారు. దాదాపు నెల రోజుల పాటు వీటిని వాడినా ఫలితం లేకపోవడంతో ఆమెను కుటుంబీకులు గత ఏడాది డిసెంబర్‌ 21న మరోసారి నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆ రోజు ఎక్స్‌రే తీసిన నిమ్స్‌ వైద్యులు ఆమె వెన్నెముకలోని ఎల్‌–1, ఎల్‌–2 సమీపంలో ఏదో అనుమానిత వస్తువు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆ మరుసటి రోజు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె శరీరం నుంచి ఓ తూటాను బయటకు తీశారు. ఆందోళనకు గురైన వైద్యులు ఈ విషయంపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేను దర్యాప్తు చేయడానికి అటు శాంతిభద్రతల విభాగం అ«ధికారులు, ఇటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఆస్మా బేగంతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం తమకు ఏమీ తెలియదని చెప్పడంతో మిస్టరీని ఛేదించడానికి వారం రోజుల పాటు హడావుడి చేశారు. ఆస్మా బేగం శరీరంపై ఉన్న గాయాన్ని బట్టి ఆ తూటా సుదీర్ఘకాలం ఆస్మా బేగం శరీరంలో ఉండిపోయిందని వైద్యులు తేల్చారు. ఆ బుల్లెట్‌ను పరిశీలించిన నిపుణులు .32 క్యాలిబర్‌కు చెందినదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మైలార్‌దేవ్‌పల్లి కేసుతో పోల్చినా...
కేసు దర్యాప్తు అంటూ తొలినాళ్లల్లో హడావుడి చేసిన పోలీసులు ఆస్మా కుటుంబీకులతో పాటు వారి ఇంటి చుట్టుపక్కల వారినీ ప్రశ్నించారు. కొన్నాళ్ల క్రితం సైబరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకున్న హతాయత్నం కేసుతో ఈ ఉదంతాన్ని ఉన్న లింకులను పోలీసులు అధ్యయనం చేశారు. ఆస్మాబేగం తండ్రి దాదాపు 20 ఏగా పాతబస్తీకి చెందిన ఓ బడాబాబు వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అప్పట్లో ఆయన కుమారుడిపై ఓ కాల్పుల కేసులో ఆరోపణలు వచ్చాయి. పాతబస్తీకి చెందిన ఈ బడాబాబు కుమారుడు, మరో వ్యక్తి కలిసి నగర శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. కింగ్స్‌ కాలనీలో ఉన్న బడాబాబు కుమారుడి కార్యాలయంలో 2017 నవంబర్‌లో ఓ విందు జరిగింది. ఆ సందర్భంలో అక్కడ కాల్పులు చోటు చేసుకుని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సదరు బడాబాబు కుమారుడితో పాటు అతడి తుపాకీ కోసమూ కొన్ని రోజులు ముమ్మరంగా గాలించారు. అప్పట్లో అతగాడు తన తుపాకీని తన తండ్రి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఆస్మాబేగం తండ్రి ఇంట్లో దాచి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సందర్భంలో జరిగిన మిస్‌ఫైర్‌తోనే తూటా ఆస్మా బేగం శరీరంలోకి దూసుకుపోయి ఉంటుందని అంచనా వేశారు. 

అర్థాంతరంగా ఆగిపోయిన దర్యాప్తు...
కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయినట్లు..కొత్త కేసుల రొదలో ఈ కాల్పుల కేసుకు చెద పట్టింది. కొన్ని రోజులు దర్యాప్తు పేరుతో హడావుడి చేసిన పోలీసులు ఆపై మిన్నకుండిపోయారు. మైలార్‌దేవ్‌పల్లిలో కేసు ఉన్న సందర్భలో ఈ మిస్‌ఫైర్‌ విషయం బయటకు వస్తే మరింత ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో దుండగులు రహస్యంగా ఉంచి, స్థానికంగా వైద్యం చేయించి ఉండవచ్చని అనుమానించిన అధికారులు ఆ కోణంలో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయారు.

ఓ దశలో ఆస్మా కుటుంబీకులు పోలీసుల పైనే ఎదరుదాడికి దిగారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో శస్త్రచికిత్స చేసినప్పుడు ఆస్మా శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీయలేదని, పోలీసులు ఎక్కడి నుంచో తీసుకువచ్చి పెట్టారని, శరీరం నుంచి తీసినట్లు కట్టుకథ అల్లారని ఆరోపించినట్లు ఆయన వివరించారు. దీంతో పాటు కొన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు ఆస్మాబేగం కేసును అటకెక్కించారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement