
బెంగళూరు: స్మార్ట్ ఫోన్లో పబ్‌జీ గేమ్‌కు బానిసైన యువకుడు ఆ ఉన్మాదంతో కన్నతండ్రినే కత్తిపీటతో ముక్కలుగా నరికి చంపాడు. ఈ ఘోరం కర్ణాటకలో బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో సోమవారం జరిగింది. హతుడు శంకరప్ప కమ్మార(60) కాగా, నిందితుడు అతని కుమారుడు రఘువీర్ కమ్మార (25). ఐటీఐ మెకానికల్ రెండో ఏడాది చదువుతున్న రఘువీర్ మొబైల్‌లో గేమ్స్‌కి అలవాటు పడ్డాడు. శనివారం అర్థరాత్రి నుంచే రఘువీర్ ఇంట్లో, తమ వీధిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని, అర్థరాత్రి బయటకు వచ్చి ఇతరుల ఇంటికి వెళ్ళి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని గట్టిగా అరుస్తూ గొడవలు చేస్తున్నాడని స్థానికులు పోలీసులకి తెలిపారు. వారి ఫిర్యాదుతో ఆదివారం తల్లిదండ్రులతో పాటు అతన్ని పోలీసులు పిలిపించి హెచ్చరించారు.
ఘోరం జరిగింది ఇలా..
ఆదివారం అర్థరాత్రి దాటుతున్నా కుమారుడు మొబైల్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతుండడం, అతని చేతికి రక్తం వస్తుండడం చూసి తల్లి చేతికి కట్టు కట్టబోయింది. దీంతో రఘువీర్ గొడవకు దిగాడు. వెంటనే తండ్రి వెళ్లి గట్టిగా పట్టుకుని కట్టుకట్టబోగా ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. తల్లిని మరో గదిలోకి నెట్టి గడియపెట్టి తన చేతికి ఉన్న బ్యాండేజ్ మొత్తం విప్పి తండ్రి గొంతుకు చుట్టి హత్య చేయబోయాడు. రఘువీర్ కత్తిపీటను తీసుకొని తండ్రి పైన దాడి చేయడంతో అతడు ప్రాణాలు విడిచాడు. రఘువీర్ అంతటితో ఆగకుండా తండ్రి మొండాన్ని, తలను వేర్వేరుగా నరికేశాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వచ్చే ప్రయత్నం చేయగా వారిపై కూడా కత్తిపీటతో దాడికి యత్నించాడు. సుమారు అరగంట పాటు అలా ముప్పతిప్పలు పెట్టాడు. పోలీసులు ఒక బెడ్‌షీటు తీసి అతని పైన వేసి గట్టిగా పట్టుకొని బంధించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment