కేవీబీపురం: యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దిగువపూడి గ్రామానికి చెందిన వంశీ(19) దారుణ హత్యకు గురవడం విదితమే. అతడి తల, మొండెం, చేయి, కాలు నరికి వేసి, తలను మరొక చోట పూడ్చి పెట్టడం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు అలియాస్ నాగేష్‌ను గురువారం పుత్తూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరు రూరల్ సీఐ దైవప్రసాద్ కేవీబీపురం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు వెల్లడించిన వివరాలు...మండలంలోని దిగువపూడికి చెందిన వంశీ(19) అదే గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రావు(నాగేష్) స్నేహితులు. నాగేష్ తిరుమలలో టీ అమ్ముకుంటూ, వారానికోసారి భార్యాపిల్లల వద్దకు వచ్చివెళ్లేవాడు.
ఈ నేపథ్యంలో తన భార్యతో వంశీ చనువుగా ఉండడాన్ని గమనించాడు. భార్యను మందలించినా ప్రయోజనం లేకపోవడంతో ఎలాగైనా వంశీని అంతమొందించాలని నాగేష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం స్కెచ్ వేశాడు. గత గురువారం కట్టెల కోసమని అడవికి వెళుతున్న వంశీకి తోడుగా వస్తానని నమ్మబలికాడు. అడవికి వెళ్లిన తరువాత వంశీని నాగేష్ ప్రశ్నించాడు. తన భార్యతో చనువుగా ఉండటంపై నిలదీశాడు. మాటామాటా పెరగడంతో ఇద్దరూ కలియబడ్డారు. వంశీ కింద పడిపోవడంతో అతడు కట్టెలను నరికేందుకు తెచ్చుకున్న కత్తిని తీసుకుని నాగేష్ వంశీ మెడను నరికాడు. ఆపై వంశీ తలను మొండెం నుంచి వేరు చేశాడు.
అలాగే కుడి చెయ్యి భుజం వరకూ, ఎడమకాలును వేరుచేసాడు. మొండాన్ని పొదలచాటున పడేసి, తలను మొండెం ఉన్నచోటుకు 20 మీటర్ల దూరంలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తిని రాళ్ల నడుమ ఆకులతో కప్పెట్టి, యథావిధిగా ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యను విజయపురం మండలం ఎస్‌ఆర్ కండ్రిగలోని అత్తగారి ఇంటికి పంపించి నాగేష్ పరారయ్యాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువులు కేసు దర్యాప్తుకు కీలక ఆధారమయ్యాయి. వాటి ఆధారంగా వంశీని నాగేష్ హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడిని పుత్తూరు వద్ద అరెస్ట్ చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు చెప్పారు. కేసును ఛేదించిన కేవీబీపురం ఎస్‌ఐ గోపి, సిబ్బంది ప్రభాకర్, రాజా, బాలాజి ,రాధాకృష్ణను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment