‘సాక్షి’ కార్యాలయానికి వచ్చిన లేఖ
వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే, ఫేర్‌వెల్ పేరుతో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారు. సాధారణంగా ఏటా ఆఖరు సంవత్సరం నర్సింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థినులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకుంటారు. అది కాలేజీలోని విద్యార్థులు ఇచ్చినంత డబ్బులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అయితే ఈ కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆ పోస్టుపై కన్నేసిన ఉద్యోగులు గ్రాడ్యుయేషన్ డేను భారీగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అనుకున్న ప్రకారం విద్యార్థినుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. నర్సింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థినుల నుంచి రూ.1500, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న వారి నుంచి రూ.500 చొప్పున వసూలు చేశారు.
ఆ డబ్బుతో ఇటీవల గ్రాడ్యుయేషన్ డేను భారీగా నిర్వహించి రాజ కీయ నాయకులను ప్రసన్నం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ డే కోసం రూ.1500 చొప్పున ఇచ్చేందుకు విద్యార్థి నుల తల్లిదండ్రులు నిరాకరించినప్పటికీ కాలేజీలోని కొందరు ఉద్యోగులు విద్యార్థినులపై ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక ఇచ్చినట్లు కొందరి పేరెంట్స్ తెలిపారు.
గ్రాడ్యుయేషన్ డే చేసుకోవాలన్న నిబంధనలు లేకున్నా కాలేజీలోని కొందరు తమ పలుకుబడి పెంచుకునేందుకు భారీగా నిర్వహించారని పేరెంట్స్ వాపోతున్నారు. కాలేజీలో మూడేళ్లుగా విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వద్ద సుమారు రూ.1.50లక్షలు వసూలైనట్లు తెలుస్తోంది. తమ పిల్లల వద్ద బలవంతంగా వసూలు చేసిన సుమారు రూ.3లక్షలను వాపస్ ఇవ్వాలని నర్సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కోరుతున్నారు.
ఈ విషయంపై ‘సాక్షి’ కార్యాలయానికి తల్లిదండ్రులు ఇటీవల ఓ లేఖ పంపారు. అందులోని ఈ విషయాలపై ఆరా తీయగా ఇంచార్జి ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్లు కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, కాలేజీలోని విద్యార్థులే కమిటీగా ఏర్పడి ఫంక్షన్ నిర్వహించుకున్నారని ఉద్యోగులు తెలిపారు.
అది పూర్తిగా విద్యార్థులకార్యక్రమం
అది గ్రాడ్యుయేషన్ డే, ఫ్రెషర్స్ కోసం నిర్వహించిన కార్యక్రమం. ఆ కార్యక్రమ నిర్వహణకు డాక్టర్లు, నర్స్‌లు ఆర్థికసాయం అందించారు. మిగిలిన డబ్బులు విద్యార్థులే వసూలు చేసుకుని నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యకమాల్లో ఉపయోగించే డ్రెస్సులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు వేసుకునే డ్రస్‌లకు అద్దె ఈ డబ్బుల నుంచే చెల్లించారు. ఆ డబ్బులు ఎవరు నిరుపయోగం చేయలేదు.
– డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్, ఎంజీఎం ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment