మార్కెట్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన నిర్వాహకులు అక్రమాలకు తెరతీశారు.. తేమ అధిక శాతం ఉన్నా.. కాసులిస్తే సరే ఆ ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. రెండు కేంద్రాల నడుమ కొంతకాలంగా సాగుతున్న అక్రమ కొనుగోళ్లపై అధికారులకు రైతులు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెలుగుచూసింది.
సూర్యాపేట వ్యవసాయం : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈ నెల మొదటి వారంలో చివ్వెంల, సూర్యాపేట ప్రాథమిక వ్యవసాయ పరిపతి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం తేమశాతం 17లోపు ఉన్న రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలి. కానీ డబ్బులకు ఆశ పడిన సదరు నిర్వాహకులు రెండో వారంలోనే తేమశాతం ఎంత ఉన్నా డబ్బులిచ్చిన వారి ధాన్యం కొనుగోలు చేస్తూ అధికారులకు దొరికిపోయారు. గురువారం సూర్యాపేట పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆ కేంద్రం చైర్మెన్ బంధువు ధాన్యాన్ని 43 తేమశాతం ఉన్నా కొనుగోలు చేయడంతో కొందరు రైతుల ఫిర్యాదు మేరకు డీఎస్‌ఓ అనురాధ, డీసీఓ ప్రసాద్, డీఎం రాంపతి దాడులు నిర్వహించారు.
శుక్రవారం చివ్వెంల పీఎసీఎస్ నిర్వాహకులు కూడా అధిక తేమశాతం ఉన్న ధాన్యం ఖరీదు చేసి దొరికి పోయారు. కొందరు రైతుల ఫిర్యాదు మేరకు తేమశాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేస్తున్నారని తెలసుకున్న సివిల్ సప్లై అధికారులు శుక్రవారం మార్కెట్లోని చివ్వెంల పీఎసీఎస్ కేంద్రాలు కొనుగోలు చేసి కాంటాలు వేసిన ఆరుగురి రైతులు బస్తాలను తిరిగి తేమశా>తం తనిఖీ చేయగా 5గురి రైతుల ధాన్యం బస్తాలు 40శాతం తేమ ఉన్నట్లు తేల్చారు. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా సదరు ఇద్దరు కేంద్రం నిర్వాహకులు డబ్బులకు ఆశపడి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలనిపై అధికారులకు నివేదిక ఇచ్చారు.
వ్యవసాయ అధికారులు లేక...
నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకు వచ్చినధాన్యం తేమశాతం వ్యవసాయ విస్తరణ అధికారులు చూడాల్సి ఉంటుంది. అయితే వర్షాలకు పంట దెబ్బతిన్న రైతుల సర్వేలో అధికారులు ఉండడంతో వారు కొనుగోలు కేంద్రాల బాధ్యతలు తీసుకోలేదు. ఇదే అదునుగా భావించిన కేంద్రం నిర్వాహకులు ఎంత తేమశాతం ఉన్నా డబ్బులు ఇస్తాననడంతో అక్రమాలకు తెరతీశారని తెలుస్తోంది.
ఉద్రిక్తత.. పోలీసుల రాక
చివ్వెంల పీఎసీఎస్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు చేస్తున్నారని సైదిరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు వచ్చాక సదరు బస్తాలను చూపిస్తుండడంతో అక్కడి రైతులు గొడవకు దిగారు. ఒక దశలో అతనిపై చేయిచేసుకోవడానికి ప్రయత్నించారు. ఆందోళన చెందిన సదరు రైతు అక్కడినుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
నిబంధనలకు వ్యతిరేకంగా..
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేమశాతం అధికాంగా ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తమ విచారణలో తేలింది. రెండు కేంద్రాల నిర్వాహకులనూ చర్య తీసుకోవాలని దీంతో జేసీ సంజీవరెడ్డికి నివేదిక ఇస్తున్నాం...– డీఎం . రాంపతి
Comments
Please login to add a commentAdd a comment