ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
తమిళనాడు, అన్నానగర్: ఊత్తుక్కులి సమీపంలో ఆదివారం కారు బోల్తాపడిన ప్రమాదంలో సేలంకు చెందిన పారిశ్రామికవేత్త మృతి చెందాడు. అతని స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది. సేలం అళగాపురం పెరియపుదూర్ పిళ్లైయార్ ఆలయ వీధికి చెందిన మణియన్ (48). పారిశ్రామికవేత్త అయిన ఇతను కోవైలో తన స్నేహితులతో కలిసి బనియన్ సంస్థ నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం మణియన్ స్నేహితుడు సేలంకి చెందిన నాగరాజ్ (40)తో కారులో కోవైకి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని అనంతరం కోవై నుంచి సేలంకి కారులో తిరిగి వస్తున్నారు. కారును మణియన్ నడిపాడు. కోవై–సేలం హైవే రోడ్డులో ఊత్తుక్కులి సమీపం సెంగపల్లి ప్రాంతంలో వస్తుండగా హఠాత్తుగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మణియన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
తీవ్రగాయాలతో ప్రాణాలకు పోరాడుతున్న నాగరాజ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం తిరుప్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఊత్తుక్కులి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment