సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చిత్తు కాగితాల వ్యాపారిగా ప్రస్థానం మొదలెట్టిన కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యం రూ. కోట్లు టర్నోవర్ చేసే స్టీల్ వ్యాపారి స్థాయికి ఎదిగాడు. మరోవైపు భూకబ్జాలకు పాల్పడటం, స్థల వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేయడం.. ప్రత్యర్థులను తుదముట్టించడం వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతూ ఏ–1 రౌడీషీటర్‌గా ఎదిగాడు. ఈ తరహా ఆరోపణల నేపథ్యంలో బెజవాడలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సత్యంపై 21 కేసులు నమోదయ్యాయి. సత్యం ఆగడాలు మితిమీరడంతో పోలీసులు అతడిపై ఏ–1 రౌడీషీట్ తెరిచారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన స్పర్థల నేపథ్యంలో స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్‌ను కోగంటి సత్యం తుదముట్టించినట్టు తేలడం నగరంలో కలకలం రేపింది.
పక్కా స్కెచ్ అమలు..
తేలప్రోలు రాంప్రసాద్, కోగంటి సత్యం ఇద్దరూ 2003 నుంచి కలిసి వ్యాపారం చేశారు. ఈ నేపథ్యంలో రూ.70 కోట్లను కోగంటి సత్యంకు రాంప్రసాద్ బకాయిపడ్డాడు. ఈ వివాదం పెద్దల వద్దకు వెళ్లడంతో రూ.23 కోట్లు చెల్లించేవిధంగా సెటిల్‌మెంట్ చేశారు. రుణ మొత్తం భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చకపోవడంతో కోగంటి సత్యం ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా రాంప్రసాద్‌ను హతమార్చాలనే నిర్ణయానికొచ్చి తన అనుచరుడు శ్యామ్‌ను ఆశ్రయించాడు. రాంప్రసాద్ హత్య కేసులో ఏ–3గా ఉన్న ఆంజనేయ ప్రసాద్ అంతకుముందు తన మామగారి మెడికల్‌షాపు కేసు విషయమై సత్యంను కలిశాడు. అతడి అవసరాలను ఆసరాగా చేసుకున్న శ్యామ్ హత్య ప్రణాళిక గురించి అతడికి తెలిపాడు. హత్య కేసును అతనిపై రానివ్వకుండా చూసుకుంటామని, మెడికల్ షాపు వ్యవహారంలో అతనికి న్యాయం చేస్తామని నమ్మబలకడంతో రాంప్రసాద్‌ను హత్య చేయడానికి ఆంజనేయ ప్రసాద్ ఒప్పుకున్నాడు. ఇలా మొత్తం రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చి హత్యకు పథక రచన చేశారు.
ఇందులో ఆంజనేయ ప్రసాద్‌కు శ్యామ్ రూ.2 లక్షలు ఇచ్చాడు. ఇదే కేసులో ఏ–7 నిందితునిగా ఉన్న చంద్రిక ఆనంద్‌కు రూ.3 లక్షలు ఇచ్చాడు. కాగా కోగంటి సత్యం ఏ–6 నిందితుడైన తిరుపతి సురేష్‌కు రూ.25 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 6న పంజాగుట్ట సమీపంలో వ్యాపారి రాంప్రసాద్‌ను నిందితులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రాంప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య వైదేహి ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించారు. ఏ–1 నిందితుడైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రామును పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగిలిన ఆరుగురు నిందితులు తిరుపతి సురేష్, చంద్రిక ఆనంద్, శ్రీరామ్ రమేష్, షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, పత్తిపాటి నరేష్, వెంకట రామ్‌రెడ్డి పరారీలో ఉన్నారు.
కేసును పక్కదోవ పట్టించేలా..
కోగంటి సత్యం సూచన మేరకు అతని అనుచరుడు శ్యామ్ మీడియాతో పాటు పోలీసులకు ఈ హత్యతో సత్యంకు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు చెప్పాడు. శ్యామ్ మాటలపై పోలీసుల అనుమానం మరింత పెరిగింది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. రాంప్రసాద్ నుంచి డబ్బు రాకపోవడంతో రాంప్రసాద్‌ను హత్య చేయిస్తే.. అతడి బావమరిది తనకు ఇవ్వాల్సిన రూ.12 కోట్లు అయినా భయపడి ఇస్తాడని ఆశించి కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment