సాక్షి, తిరుమల: రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. తిరుమలలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. శుక్రవారం ఉదయం కిడ్నాపైన వీరేష్ ఆచూకీ నాందేడ్‌లో లభ్యమైంది. పిల్లాడిని అపహరించి మహారాష్ట్రకు పరారైన నిందితున్ని స్థానిక ప్రజలు గుర్తించి ఆదివారం ఉదయం నాందేడ్‌లో పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్‌ను అరెస్టు చేసి బాలుడ్ని సంరక్షణలోకి తీసుకున్నారు. వివరాలు.. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమారుడు వీరేష్‌తో కలిసి గురువారం తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం అద్దె గదులు దొరక్కపోవడంతో మాధవ నిలయం వద్ద గల మండపంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. (తిరుమలలో బాలుడి కిడ్నాప్)
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వీరేష్ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటల తరబడి వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి వద్ద నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాబు ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను నియమించారు. బాలుడి ఫొటోతో పాటు కిడ్నాప్ చేసిన వ్యక్తి చిత్రాలున్న పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి బస్సుల్లో అతికించారు.
సీసీ ఫుటేజీలు లభ్యం..
ఈ ఘటనలో బాలుడు తప్పిపోలేదని, ఓ వ్యక్తి వీరేష్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయి. తిరుమలలోని గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు మాధవ నిలయం వద్ద ఉన్న గంగమ్మవారి ఆలయం ముందు సుమారు 42 ఏళ్ల వయస్సున్న వ్యక్తి వీరేష్‌ను అపహరించినట్లు నిర్దారణకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment