
న్యూఢిల్లీ: అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. ఈ దారుణ ఘటన శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్‌ఎస్‌ఐటీ) ఆవరణలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్‌ఎస్‌ఐటీ క్యాంపస్ ఆవరణలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పసిపాపపై కారును పోనిచ్చాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. క్యాంపస్ క్యాంటీన్ ఆవరణలో, ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మృతురాలి తల్లి పేర్కొన్నారు. నిందితుడిని యూనివర్సిటీకి చెందిన ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. పాపను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment