గుండేడులో విచారణ జరుపుతున్న ఏసీపీ
కమలాపూర్: వాయిదాల పద్దతిలో డబ్బులు చెల్లిస్తే తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా మోసగిస్తున్న ఘటనపై మండలంలోని గుండేడులో గురువారం కాజీపేట ఏసీపీ కె.సత్యనారాయణ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ఏసీపీ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్రంగా శ్రీరాం రియల్ ఎస్టేట్, బిజినెస్ సొల్యూషన్ లిమిటెడ్ పేరిట కొందరు ఓ సంస్థను నెలకొల్పారు. వరంగల్‌లోనూ ఆ సంస్థ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఆ సంస్థకు చెందిన జయశంకర్ జిల్లా మొగుళ్లపెల్లి మండలం వేములపల్లికి చెందిన పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 2012లో కన్నూరుకు చెందిన వీఓ అధ్యక్షురాలు పబ్బు కవితతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురిని 2 శాతం కమీషన్‌తో ఏజెంట్లుగా నియమించుకున్నారు. వారు మండలంలోని పలువురు మహిళలను సంస్థలో సభ్యులుగా చేర్పించుకుని రెండు నుంచి ఆరేళ్ల కాలంలో వారు చెల్లించిన డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి వారి నుంచి వాయిదా పద్దతిలో డబ్బులు వసూలు చేసి కంపెనీకి అప్పగిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు రీ–పేమెంట్లు సైతం సక్రమంగా జరుగగా ఆ తర్వాత సంస్థ సీఎండీ అరెస్టై సంస్థ మూడపడింది. అప్పటి నుంచి మండలానికి చెందిన పలువురికి రావాల్సిన సుమారు రూ.4 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి.
దీంతో పలుమార్లు ఏజెంట్లను డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినా లాభంలేకపోవడంతో ఈ నెల 2న డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం 10న మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు అందిన సమాచారం మేరకు గుండేడులో విచారణ చేపట్టి ఏజెంట్లు, బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ కె.సత్యనారాయణ తెలిపారు. ఈ విచారణలో ఎల్కతుర్తి సీఐ రవికుమార్, కమలాపూర్ ఎస్సై సందీప్‌కుమార్, సర్పంచ్ రాజబోస్, ఏజెంట్లు, బాధితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment