
తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వేణుమాధవ్
మదనపల్లె క్రైం: మదనపల్లెలో రౌడీలు రెచ్చిపోయారు. కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న ఓ విద్యార్థిని సోమవారం పట్టపగలే కిడ్నాప్‌చేశారు. పొలాల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించి చివరకు చీకటిపడ్డాక అక్కడే వదలిపెట్టి వెళ్లిపోయారు. పట్టణంలో ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. బాధితుని కుటుంబీకులు, పో లీసుల కథనం మేరకు... మదనపల్లె పట్టణం నక్కలదిన్నె తాం డాలో నివాసం ఉంటున్న కాట్లగంటి రవికుమార్, గీత దంపతుల కుమారుడు వేణుమాధవ్ (16) స్థానిక బెంగళూరు రోడ్డులో లయన్స్ క్లబ్ ఎదురుగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇం టర్ మొదటి సంవత్సరం ఎంఈసీ చదువుతున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష రాయడానికి అతడు కళాశాలకు వెళ్లాడు.
పరీక్ష రాసి కళాశాల బయటకు రాగానే సిపాయి వీధికి చెందిన కొందరు రౌడీషీటర్లు అతని వెంటపడ్డారు. నడచుకుంటూ ఇంటికి వెళుతున్న అతడిని కోర్టు సమీపంలో దారి అడ్డగించి బలవంతంగా ఆటోలో ఎక్కించారు. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డి కాలనీ సమీపంలోని శేషమహల్ ఏరియా దగ్గరున్న వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వేచివున్న రౌడీ గ్యాంగ్ విద్యార్థిపై మూకుమ్మడిగా దాడిచేసింది. బీరుబాటిళ్లు, బెల్టులతో చితకబాదారు. కారణం చెప్పి కొట్టమని బ్రతిమలాడినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కొట్టడం పూర్తయ్యాక వారు పీకల దాకా మద్యం తాగారు. రాత్రి 9 గంటల సమయంలో అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఎక్కడున్నా వెతికి చంపేస్తామని కూడా చెప్పారు. అనంతరం బాధితుడు ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.