
తండ్రి దాడిలో ప్రాణాలు కోల్పోయిన కృష్ణవేణి (ఫైల్ ఫొటో, మృతదేహం)
సాక్షి, విజయవాడ : ఫోన్ కాల్స్ వ్యవహారం ఓ విద్యార్థిని ప్రాణాలు పోవడానికి కారణమయింది. కూతురి కోసం ఎడతెరిపిలేకుండా కాల్స్ వస్తుండటంతో సహనం కోల్పోయిన తండ్రి ఉన్మాదిలా మారి.. కన్నబిడ్డనే పొట్టనపెట్టుకున్నాడు. విజయవాడలో సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితుడిని సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది? : స్థానిక ఉడా కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తోన్నాడు రమణ. అతనికి పదోతరగతి చదివే కూతురు(కృష్ణవేణి) ఉంది. ఇటీవలికాలంలో కృష్ణవేణి కోసమంటూ రమణ మొబైల్‌కి కాల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇదే విషయమై నాలుగురోజుల కిందట ఇంట్లో గొడవజరిగింది. ఆ కాల్స్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదని కూతురు తెగేసి చెప్పింది. అయినాసరే వినిపించుకోకుండా ఉన్మాదిలా మారిన రమణ.. కూతురిని విచక్షణారహితంగా కొట్టాడు. కణత భాగంలో బలంగా దెబ్బతగలడంతో కృష్ణవేణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
అనారోగ్యంతో చనిపోయిందటూ అంత్యక్రియలు.. : కాగా, తండ్రి కొట్టడం వల్లే కృష్ణవేణి చనిపోయిన విషయాన్ని దాచిపెట్టిన కుటుంబీకులు.. అనారోగ్యం వల్లే ప్రాణాలు కోల్పోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఆమేరకు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కలవారు అందించిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకిదిగారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించగా.. కణతపై దెబ్బవల్లే కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. దీంతో కేసు నమోదుచేసుకుని నిందితుడు రమణను అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణవేణి మృతదేహం, నిందితుడు రమణ