వాట్సాప్‌లో బెట్టింగ్‌! | IPL Cricket Betting On Whatsapp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో బెట్టింగ్‌!

Published Tue, May 8 2018 1:39 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

IPL Cricket Betting On Whatsapp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐపీఎల్‌ మొదలుకాగానే బెట్టింగ్‌ జోరు మళ్లీ మొదలైంది. రోజూ వందల కోట్ల రూపాయల పందేలు జోరుగా జరిగిపోతున్నాయి. బుకీలు, సబ్‌–బుకీలు వాట్సాప్‌ గ్రూపులు పెట్టి మరీ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నిఘా ఎక్కువగా ఉండటంతో.. ‘సెట్టింగు’లన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అకౌంట్ల నిర్వహణకు మాట్రిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ను.. ఆర్థిక లావాదేవీల కోసం ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్లు, పేటీఎం వంటి యాప్స్‌ను వాడుతున్నారు.. ఇలా వ్యవస్థీకృతంగా బెట్టింగ్‌ దందా సాగిస్తున్న నాలుగు ముఠాలకు హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. గట్టి నిఘా పెట్టి.. 12 మందిని అరెస్టు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ సోమవారం ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.

ఇక్కడ హడావుడి లేకుండా..
సాధారణంగా బెట్టింగులు నిర్వహించే బుకీలు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. టీవీలు, సెట్‌టాప్‌ బాక్సులు, ల్యాప్‌టాప్‌లు, హాట్‌లైన్‌ బాక్సులు వంటివి అవసరమవుతాయి. బెట్టింగ్‌ స్థావరాలపై పోలీసులకు సమాచారం అందడానికి ఇవి కారణంగా మారుతాయి. దీంతో ప్రస్తుతం ప్రధాన బుకీలు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్‌లలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, మంగళ్‌హాట్, కాచిగూడ, అబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో సబ్‌–బుకీలను ఏర్పాటు చేసుకున్నారు.

ఈ సబ్‌–బుకీలు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి.. అందులో బెట్టింగ్‌ నిర్వహిస్తారు. ఈ గ్రూపులు ఇంటర్‌నెట్‌ ద్వారా ప్రధాన బుకీ వద్ద ఉండే ల్యాప్‌టాప్‌లోని మ్యాట్రిక్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఒక్కో మ్యాచ్‌ పూర్తయిన తరవాత సదరు ల్యాప్‌టాప్‌ నుంచి బ్యాలెన్స్‌ షీట్‌ తీస్తారు. ఎవరెవరు ఏ టీమ్‌పై పందెం కాశారు, రేషియో ఎంత, గెలుపోటములను బట్టి ఎవరికి ఎంత చెల్లించాలి, ఎవరి నుంచి ఎంత వసూలు చేయాలన్న వివరాలన్నీ వస్తాయి. ఇందులో పంటర్ల పేర్ల స్థానంలో మాత్రం బుకీలు, సబ్‌–బుకీలు ఇచ్చిన కోడ్‌ నేమ్స్‌ వస్తాయి.

బెట్‌ఫేర్, లైవ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లతో..
సాధారణంగా బుకీలు తమకు పరిచయస్తులైన పంటర్ల నుంచే బెట్టింగులు అంగీకరిస్తారు. ముందుగా ఒక్కో పంటర్‌ నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేస్తారు. ఆపై వారికి కొన్ని నంబర్లు ఇస్తారు. మ్యాచ్‌ ప్రారంభవడానికి ముందు పంటర్లు బుకీలకు ఫోన్‌ చేసి స్ట్రైక్‌ తెలుసుకుంటారు. ఏ టీమ్‌పై ఎంత చొప్పన పందెం నడుస్తోందో తెలియజేయడాన్ని స్ట్రైక్‌ అంటారు. అంటే బలహీనంగా ఉన్న జట్టుపై పందెం కాసిన పక్షంలో... ఆ జట్టు గెలిస్తే కట్టిన సొమ్ముకు రెండు నుంచి నాలుగింతలు ఇస్తారు. అదే బలమైన జట్టుపై పందెం కాస్తే... కేవలం రెట్టింపుగానీ, అంతకన్నా తక్కువగానీ ఇస్తారు. ఈ స్టైక్‌ తెలుసుకున్న పంటర్లు తాము ఏ టీమ్‌పై పందెం కాస్తున్నామో చెబుతారు. స్ట్రైక్స్‌ తెలుసుకోవడానికి ప్రత్యేకంగా బెట్‌ఫేర్‌ అనే వెబ్‌సైట్‌ కూడా పెట్టుకున్నారు. ఇటీవల కాలంలో బుకీలంతా కలసి లైవ్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు. హరియాణా కేంద్రంగా ఉన్న ఈ నెట్‌వర్క్‌లో ప్రధాన భాషలన్నింటిలో.. ఎప్పటికప్పుడు జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన రేషియో, ఫేవరెట్‌ టీమ్, ఫేవరెట్‌ ప్లేయర్‌ తదితరాలను ప్రధాన, సబ్‌–బుకీలకు అందుబాటులో ఉంచుతారు. దీనికోసం ఒక్కొక్కరు నెలకు రూ.4 వేల చొప్పున రుసుము చెల్లిస్తుంటారు.

ఫేస్‌బుక్‌ ద్వారా సలహాలు, సూచనలు..
ప్రతి మ్యాచ్‌కు సంబంధించి అనేకమంది అనలిస్టులు ఫేస్‌బుక్‌ ద్వారా పంటర్లకు అందుబాటులో ఉంటారు. తమ చిరునామా, ఇతర వివరాలను బయటపడనీయని వారు.. ఆ మ్యాచ్‌లో ఎవరు ఫేవరేట్, తీరు తెన్నులు, గెలుపోటములు ఎలా ఉంటాయి? వంటి అంశాలపై ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా సలహాలు ఇస్తుంటారు. ఇందుకోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.100 నుంచి రూ.1,000 వరకు ఆన్‌లైన్‌లో వసూలు చేస్తుంటారు. పందాలు కాయడానికి ఫేవరెట్స్‌ను మాత్రం నిర్ణయించేది చేసేది బుకీలే. టాస్‌ ఎవరు గెలుస్తారనే దానిపై రూ.1,000 పందెం కాసి గెలిస్తే.. గెలిచిన వ్యక్తికి రూ.1,900 చెల్లిస్తారు. ఫేవరెట్‌ టీమ్, క్రీడాకారుడిపై రూ.1,000 పందెం కాసి.. గెలిస్తే రూ.1,400 ఇస్తారు. ఫలానా ఓవర్‌లో, లేదా కొన్ని ఓవర్లలో ఇన్ని పరుగులు చేస్తారనే ‘సెషన్స్‌’పై రూ.1,000 పందెం కాసి గెలిస్తే రూ.2వేలు చెల్లిస్తారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో టాస్, ఫేవరెట్, సెషన్స్‌ మీదే ఎక్కువగా పందాలు సాగాయి.

చిక్కింది వీరే..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ముంబై కేంద్రంగా ఉన్న ప్రధాన బుకీలు పి.మహేష్, ఆర్‌.చిరాన్‌ల కింద పనిచేస్తున్న సబ్‌–బుకీలు, ఏజెంట్లయిన మహేష్‌ మనియాల్, ఎస్‌.సాయికుమార్, రాజ్‌కుమార్, వినోద్‌..
– గోవా కేంద్రంగా దందా నడుపుతున్న ప్రధాన బుకీ ప్రకాశ్‌సింగ్‌ కింద పనిచేస్తున్న ఎన్‌.ముఖేశ్‌సింగ్, సి.శ్రీనివాస్, కునాల్‌సింగ్, సుర్జీత్‌సింగ్‌..
– రాజస్థాన్‌లో కేంద్రం నడిపిస్తున్న ప్రధాన బుకీ రాకేశ్, రాజుల కింద పనిచేస్తున్న వినయ్‌ మోదీ, పిట్టీ ప్రీతేష్‌..
– ఈ మూడు గ్యాంగులతో పాటు మరో గ్యాంగుకు చెందిన జి.ఉపాధ్యాయను పోలీసులు పట్టుకున్నారు. వీరిందరి నుంచి రూ.15.5 లక్షల నగదు, 22 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.7.27 లక్షలను ఫ్రీజ్‌ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement