సాక్షి, విశాఖపట్నం : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని న్యాయవాది సలీంతో తన గోడును వెల్లబోసుకున్నాడు. సిట్ అధికారుల ఆరు రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడ్ని సెంట్రల్ జైలులోని హై సెక్యురిటీ జోన్‌లో ఒంటిరిగా ఉంచారు. శ్రీనివాస్ బెయిల్ కోసం అతని కుటుంబ సభ్యులు ఎవరు ప్రయత్నించకపోవడంతో న్యాయవాది సలీం అతని తరపున ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలులో నిందితుడ్ని కలిసిన ఆయన సోమవారం సాక్షితో మాట్లాడారు.
‘శ్రీనివాస్ బెయిల్ పిటీషన్‌తో పాటు అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరో పిటిషన్‌ను దాఖలు చేసాను. బెయిల్ పిటిషన్ రేపు నోటీసుకు వస్తుంది. విచారణ ఎప్పుడు జరుగుతుందనే విషయం తెలుస్తోంది. శ్రీనివాస్ చాలా భయపడిపోతున్నాడు. అతన్ని చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని నాతో చెప్పాడు. ఈ రోజు సాయంత్రం మరోసారి అతన్ని కలుస్తున్నాను. మరికొన్ని విషయాలు చెబుతానన్నాడు. తనతో అతని తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పాడు.’ అని న్యాయవాది సలీం పేర్కొన్నారు.
ఇటీవల వైద్య పరీక్షలకు తీసుకు వచ్చినప్పుడు కూడా మీడియాను చూసి తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ అరిచిన విషయం తెలిసిందే. మళ్లీ న్యాయవాదితో కూడా అలానే అనడంతో విచారణపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నిందితుడిని అదనపు కస్టడీ కోరుతూ సమగ్రమైన వాదనను, డాక్యుమెంట్లను సమర్పించకపోవడంతో కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను మేజిస్ట్రేట్ డిస్మస్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సిట్ అధికారులు సరైన డాక్యుమెంట్లతో పిటిషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment