
సనత్‌నగర్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టై షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మార్కెట్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. 2004లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇతరులను తన భార్య, పిల్లల పేరుతో అమెరికా పంపినట్లు వచ్చిన ఆరోపణలపై సెప్టెంబర్ 9న అతడిని అదుపులోకి తీసుకున్న మార్కెట్ పోలీసులు 10న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. అయితే ఈ కేసు దర్యాపు కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ మార్కెట్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జగ్గారెడ్డిని విచారించి తిరిగి కోర్టులో హాజరుపరచడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ 22వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆదివారం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి మార్కెట్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన ఎస్‌ఐ అంజయ్య ఎదుట రిజిస్టర్‌లో సంతకం చేశారు.