
ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తాజాగా థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వే వెల్లడించడంతో దేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది. మరోవైపు భారత్ పర్యటనకు వచ్చిన విదేశీ మహిళలపై బుధవారం లైంగికదాడి యత్నం జరగడంతో దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమేనన్న వాస్తవం కళ్లకు కట్టినట్టయింది.
వివరాలు.. పింక్ సిటీ (జైపూర్) పర్యటనలో ఉన్న ఇద్దరు మెక్సికన్ మహిళలు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో దిగారు. హోటల్ జనరల్ మేనేజర్ రిషిరాజ్ సింగ్(40) బుధవారం రాత్రి వారి గదిలోకి చొరబడి అత్యాచార యత్నం చేశాడని పోలీసులు తెలిపారు. అతని బారి నుంచి తప్పించుకున్న సదరు మహిళలు హోటల్ సిబ్బంది సాయంతో పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు, ఘటనా ప్రదేశంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రిషిరాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని జైపూర్ (దక్షిణ) డీసీపీ వికాస్ పాటక్ వెల్లడించారు.