సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఈ హత్యకేసుకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లకు చెందిన ఓ కౌన్సిలర్ భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంజిరెడ్డి, శ్రీను, రాములు అనే వ్యక్తులు రాకేష్‌రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాకేష్ రెడ్డి తనకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంజిరెడ్డి వెల్లడించాడు.
రాకేష్ రెడ్డి.. జయరాంను హత్య చేసిన తర్వాత అంజిరెడ్డిని ఇంటికి పిలిపించాడని, రాకేష్ ఇంట్లో జయరాం మృతదేహాన్ని చూసిన అంజిరెడ్డి, అతని మిత్రులు అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసు విచారణలో తేలింది. హత్య జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కారణంగా అంజిరెడ్డి, అతని మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు. జయరాం హత్యకేసు ప్రధాన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను నాంపల్లి కోర్టు మరోసారి 8 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పోలీసులు నిందితులను చంచల్ గూడ జైలునుంచి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment