
రణస్థలం: మరో ఆర్థిక నేరం. మొన్న నరసన్నపేట, నిన్న సంతకవిటి సంఘటనలు మర్చిపో క ముందే రణస్థలం మండలం పైడిభీమవరంలో ఇంకో మోసం వెలుగు చూసింది. జ్యూయలరీ షాపు అధినేతలుగా చెలామణీ అవుతున్న ఇద్దరు అన్నదమ్ములు రూ.15 కోట్లకుపైగా అప్పులు చేసి ఇప్పుడు ఎవరికీ కనిపించకుం డా పోయినట్లు తెలిసింది. దీనిపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశతో అప్పులు ఇచ్చిన వారు పోలీసులను కూడా ఆశ్రయించలేకపోతున్నారు.
అధిక వడ్డీ ఆశ చూపి..
రణస్థలం మండలంలోని పైడిభీమవరంలో ఏడెనిమిదేళ్లుగా వెంకటరామ జ్యూయలర్స్ యజమానులుగా చలామణీ అవుతున్న దన్నాన రామినాయుడు, లక్ష్మణ కస్టమర్లతో సన్నిహితంగా మెలిగేవారు. నూటికి రూ.6, రూ.10లు చొప్పున వడ్డీ ఇస్తూ చాలా మంది వద్ద అప్పులు చేశారు. అయితే నెలకు ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేస్తుండడంతో వీరికి అప్పులు ఇచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. రెండు మూడేళ్ల పాటు అదే మండలంలోని పైడిభీమవరం, నారువ, అక్కయ్యపాలెం పరిసర ప్రాంతవాసుల నుంచి సుమారు రూ.6కోట్ల వరకు అప్పులు చేశారు. ఇక్కడే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, బెజ్జిపురం గ్రామాల్లో కూడా ఇలా ఆధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లలో అప్పులు చేసినట్లు సమాచారం. దీంతో పాటు బంగారం ఆర్డర్లు తీసుకుని తిరిగి వస్తువులు ఇవ్వకుండా తిప్పించిన దాఖలాలు కూడా ఇప్పుడే బయటపడుతున్నాయి. దాదాపు 200 తులాల వరకు బంగారం వస్తువులను వీరు వినియోగదారులకు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. అయితే పది రోజులుగా వీరు కనిపించకపోవడంతో అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన పెరిగింది.
వ్యసనాలకు అలవాటు పడేనా..?
అన్నదమ్ముల్లో చిన్నవాడు లక్ష్మణకు అన్ని వ్యసనాలకు అలవాటు పడి, బెట్టింగ్‌లు ఇతరత్రా కార్యక్రమాలు చేసేవాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అన్నదమ్ములు పది రోజులుగా పత్తా లేకుండా పోవడంతో సుమారు 50 మంది బాధితులు ఈ అన్నదమ్ముల స్వగ్రామమైన బెజ్జిపురానికి వెళ్లి ఆ గ్రామ పెద్దలను కలిసి విషయం చెప్పారు. దీంతో అక్కడ పెద్దలు ఇచ్చిన సమాచారం విని వీరు అవాక్కయ్యారు. సొంత గ్రామంలో కూడా ఈ అన్నదమ్ములు అధిక వడ్డీల ఆశ చూపి రూ.కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పులు చెల్లించలేక వారి వద్ద ఉన్న సుమారు రెండెకరాల భూమిని రాసిచ్చేశారని తెలియడంతో బాధితుల్లో భయం పెరిగింది. తమ డబ్బులకు ఇక దిక్కెవరు అంటూ వీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అధిక వడ్డీలకు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వడంతో పోలీసులను కూడా ఆశ్రయించలేక లోలోపలే కుమిలిపోతున్నారు. దీనిపై జేఆర్ పురం ఎస్సై వి.సత్యనారాయణను వివరణ కోరగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment