బాధిత మహిళ(ఫొటో కర్టెసీ: ఇండియాటుడే)
రాంచి : యువకుడు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించిన వివాహితకు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆమెను పిలిపించిన మహిళా పంచాయతీ సభ్యులు సదరు మహిళను దారుణంగా కొట్టి జుట్టు కత్తిరించారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...బాధిత మహిళ భర్తతో కలిసి కోడెర్మా జిల్లాలోని దంగోడి అనే గ్రామంలో జీవిస్తోంది. భర్త మేనల్లుడైన 22 ఏళ్ల యువకుడు తరచుగా వాళ్లింటికి వచ్చేవాడు. ఈ క్రమంలో బాధిత మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. మూడు నెలలుగా ఇదే తంతు కొనసాగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఆ ఊరి మహిళా పంచాయతీ సభ్యులను కలిసి బాధిత మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఈ సంబంధం కొనసాగించాల్సిందిగా తనను వేధిస్తోందని చెప్పాడు. దీంతో వాళ్లంతా ఆమె ఇంటికి చేరుకుని బయటికి లాక్కొచ్చి అర్థనగ్నంగా మార్చి తీవ్రంగా దాడి చేశారు. తప్పు చేశావంటూ ఆమె జట్టు కత్తిరించి పంచాయతీ వద్దకు ఈడ్చుకువచ్చారు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో 11 మంది వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారిని విచారిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment