
సాక్షి, జైపూర్ : ప్రేమ మైకంలో తప్పు చేయటం ప్రారంభించిన ఆ యువకుడికి.. తాను మోసపోయానన్న విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే చేసిన నిర్వాకానికి మూల్యం చెల్లించేందుకు ఆ తప్పును కొనగించిన ఆ భగ్న ప్రేమికుడు చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్లే... రమేష్(22) అనే యువకుడు ఏడాది అదే గ్రామంలో ఉంటున్న ఓ వివాహితతో ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమెను ఒప్పించి ఇంట్లోంచి పారిపోయి పొరుగురిలో సహజీవనం చెయ్యటం ప్రారంభించాడు. దీనిని అవమానంగా మహిళ భర్త భావించి గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేశాడు. దీంతో పెద్దలు రమేష్‌కు 40,000 రూ. అపరాధ రుసుమును విధించారు. అయితే అదే డబ్బును చెల్లిస్తే... వారిద్దరూ కలిసి జీవించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె భర్త చెప్పటంతో అందుకు రమేష్ అంగీకరించాడు.
ప్రేమ కోసమై... తమ సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డు తొలగిపోవటంతో ఎలాగైనా ఆ డబ్బు కోసం రమేష్ తీవ్రంగా యత్నించాడు. అయితే ఎక్కడా డబ్బు లభించకపోవటంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైకులు దొంగతనం చెయ్యటం ప్రారంభించాడు. ఇలా డబ్బును కూడబెడుతున్న సమయంలో అతనికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లేఖ రాసి మరీ ఆ మహిళ మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ‘రమేష్ కంటే ముందు నుంచే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. అతనిని విడిచి ఉండటం ఇష్టం లేదంటూ’ ఆమె లేఖలో పేర్కొంది. ఈ కథ ఇక్కడితోనే ఆగిపోలేదు.
పంచాయితీ పెద్దలు ఆదేశించిన రుసుమును చెల్లించాలి కాబట్టి.. దొంగిలించిన బైకులను అమ్మేయత్నంలో రమేష్ పోలీసులకు చిక్కాడు. గత కొన్ని నెలలుగా ఆ ముగ్గురు మొత్తం 50 బైకులను దొంగిలించారని.. 38 బైకులను ఇప్పటికే అమ్మేశారని ఉదయ్‌పూర్ పోలీసులు వెల్లడించారు. అయితే వచ్చిన డబ్బుల్లో మెజార్టీ వాటాను మిగిలిన ఇద్దరే తీసుకోవటంతో తాను దొంగతనాలు కొనసాగించాల్సి వచ్చిందని రమేష్ చెబుతున్నాడు. స్టేషన్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ తన లవ్ ‘ఫెయిల్యూర్’ స్టోరీ చెబుతూ సాంత్వన పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment