జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్‌సమంద్ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వరాజ్ సింగ్ మేవార్‌ను.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.
రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాడ్ రాజ్య 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషికం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో ఈ కార్యక్రమం జరిగింది.
పట్టాభిషేకం అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్‌పుర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.
ఉదయ్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే నడుతుస్తున్నాయి. దీంతో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లిన మహారాజును , అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది.
విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే విశ్వరాజ్ తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ ముందు గత రాత్రి 5 గంటల పాటు నిలుచున్నారు. అనంతరం ఆయన అభిమానులు, మద్దుతుదారులు ప్యాలెస్‌పై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాలెస్ లోపల ఉన్న వ్యక్తులు కూడా రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయపూర్ ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment