ప్రతీకాత్మక చిత్రం
బంజారాహిల్స్ : గత జూన్ 28న జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లోని అమినేషియా పబ్‌లో పీకల దాకా మద్యం సేవించిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ ఫిరోజ్‌ఖాన్ మాజీ లవర్ చేతులను బ్లేడుతో గాట్లు పెట్టిన ఘటన మరిచిపోకముందే అదే పబ్‌లో అర్ధరాత్రిదాకా విపరీతమైన శబ్దంతో ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చుట్టు పక్కల నివాసితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఈ పబ్ కొనసాగుతోందని రోజూ న్యూసెన్స్ పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంత వరకు అమినేషియా పబ్ నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు.
జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లోని టిక్కి షాక్ పబ్‌లో ఈ నెల 20న బౌన్సర్ల మధ్య జరిగిన గొడవలో ఓ బౌన్సర్ తలపగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కూడా అర్ధరాత్రి స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇంత వరకు నిందితులపై చర్యలు కరువయ్యాయి. గత ఆరు నెలల కాలం టిక్కిషాక్ పబ్‌లో పలు ఘటనలు వెలుగు చూసాయి. అంతుకు ముందు ఓ డీఎస్పీ కుమారుడిపై కూడా రౌడీలు దాడి చేశారు. ఇటీవలనే ఓ ఛానల్ విలేకరి మీద ఇదే పబ్‌లో దాడి జరిగింది. తాజాగా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లోని 788 అవెన్యూ పబ్ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత కూడా లిక్కర్ సరఫరా చేస్తుండటంతో పాటు పెద్ద పెద్ద శబ్దాలతో న్యూసెన్స్ చేస్తుండగా యజమాని మోహన్‌రెడ్డి, మేనేజర్ రాజ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో పబ్‌లలో అర్ధరాత్రి దాకా పీకల దాకా మద్యం సేవించిన యువకులు వీరంగం సృష్టిస్తున్నారు.
ఏడాది కాలంగా పీఎస్‌లో నమోదైన కేసుల్లో పబ్‌లలో జరుగుతున్న ఘర్షణకు సంబంధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా పబ్‌లు తెరిచి ఉంటుండటంతో పోలీసులు వెళ్లి బంద్ చేయించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు నిర్వాహకులు పోలీసులపైనే తిరగబడ్డ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. జూబ్లీహిల్స్‌లో మొత్తం 28 పబ్‌లు కొనసాగుతుండగా 80 శాతం పబ్‌లపై నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదై ఉన్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా నిర్వాహకులు తీరు మార్చుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి పబ్‌ల ముందు గొడవలు షరా మామూలయ్యాయి.
రోడ్డు నెం.45లోని ఫ్యాట్ పీజియన్ పబ్‌లో అర్ధరాత్రి దాకా మద్యం సేవించిన కొందరు యువకులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించిన ఘటన సంచలనం సృష్టించింది. ఇంకో వైపు మద్యం మత్తులో పబ్ నుంచి బయటకు వస్తున్న యువతీ యువకులు అదుపు తప్పిన వేగంతో దూసుకుపోతూ జూబ్లీహిల్స్ రహదారులపై న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పబ్‌లపై నియంత్రణ కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అంతే కాకుండా టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా పబ్‌లపై నిఘా ఉంచితే కొంతవరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment