డ్యాన్స్‌ బార్లలో నోట్ల వర్షం | North Indian Bar Dancers In Karnataka Pubs And Clubs | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ బార్లలో నోట్ల వర్షం

Published Mon, Oct 8 2018 11:55 AM | Last Updated on Mon, Oct 8 2018 3:51 PM

North Indian Bar Dancers In Karnataka Pubs And Clubs - Sakshi

కర్ణాటక, బనశంకరి:  ఐటీ సిటీలో పబ్బులు, డ్యాన్సింగ్‌ బార్లు, అటాచ్డ్‌ బార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిని సంపన్నులు, అధికాదాయ యువకులు తదితరులు  వెల్లువలా సందర్శిస్తుంటారు. బ్రిగేడ్‌రోడ్, ఎంజీరోడ్‌తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో పదులసంఖ్యలోనున్న పబ్బులు,డ్యాన్సింగ్‌ బార్లలో డ్యాన్స్‌ లు చేసే యువతులపై ప్రతి రోజూ రూ.5 కోట్లకు పై గా నోట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది అతిశయోక్తి అనిపించినా నిజం. దేశ విదేశీ మద్యం మత్తులో వినుసొంపైన మ్యూజిక్‌లో నగరవాసులు బార్‌డ్యాన్సర్ల పై నోట్లను విచ్చలవిడిగా వెదజల్లుతుంటారు.  

బెంగళూరులో తామరతంపర  
రాష్ట్రంలో ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో ఈ మాఫియా అధికంగా ఉంది. బెంగళూరులో అంచనా ప్రకారం 100కు పైగా లైవ్‌బ్యాండ్, డాన్స్‌బార్‌లు ఉన్నాయి. 325 అటాచ్డ్‌ బార్‌లు కలిగిన పబ్‌లు 61 ఇండిపెండెంట్‌ పబ్‌లు ఉన్నాయి. అనేక బార్లు, పబ్‌లో ఎలాంటి అనుమతులు లేని డ్యాన్స్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  

ఉత్తరాది నుంచి డ్యాన్సర్ల రాక  
బీహార్, నేపాల్, పశ్చిమ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్, ముంబయిల నుంచి అమ్మాయిలు ఇక్కడకు డ్యాన్సర్లుగా వస్తున్నారు.  
కొన్ని బార్లు, పబ్‌లలో కస్టమర్లను ఆకర్షించడానికి విదేశీ యువతులను రప్పిస్తున్నారు.
నగదు, ఉద్యోగం పేరుతో యువతులకు ఆశచూపించి నగరానికి రప్పించే మధ్యవర్తులు  పీజీ, లాడ్జ్‌లు, లేదా రింగ్‌రోడ్డులో ఉండే అపార్టుమెంట్లులో వసతి కల్పిస్తారు.  
నిత్యం సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో బౌన్సర్లభద్రత మధ్య వాహనాల్లో డ్యాన్సర్లను బార్లకు తరలిస్తారు.  
నృత్యాలను వీక్షించడానికి రోజూ బార్‌కు విచ్చేసే పర్మినెంట్‌ గిరాకీలు ఉంటారు. ఇలాంటి వారికి రాయితీ , ఇతరత్రా సౌలభ్యాలూ ఉంటుంది. గొడవలు జరిగితే అదుపుచేయడానికి వస్తాదులూ ఉంటారు.  

నిబంధనలు ఏం చెబుతున్నాయి?  
మ్యూజిక్‌ వేయడానికి స్థానిక పోలీసులతో అనుమతి తీసుకోవాలి  
డ్యాన్స్‌బార్లలో యువతులతో అసభ్య అశ్లీల నత్యాలు ప్రదర్శించరాదు యువతులపై నోట్లు చల్లరాదు, నిర్ణయించిన యూనిఫారాల్నే డ్యాన్సర్లు ధరించాలి.  

 ఎక్కడెక్కడ ఎక్కువంటే..  
మెజస్టిక్, అశోకనగర, కోరమంగల, ఇందిరానగర, గాంధీనగర, బ్రిగేడ్‌రోడ్, డబుల్‌రోడ్, శేషాద్రిపుర, మైసూరురోడ్డు, దుమ్మలూరు, ఎలక్ట్రానిక్‌ సిటీ, మినర్వా సర్కిల్, జేసీ.రోడ్డు, రెసిడెన్సీ రోడ్డుతో పాటు నగరంలోని హైఫై ఏరియాల్లో నృత్యాలు నిత్యకృత్యం.  
ప్రతి పబ్‌లో నిత్యం రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్దరాత్రి 1 గంట వరకు యువతులతో డ్యాన్స్‌లు నిర్వహిస్తారు. ఈ ఐదు గంటల అవధిలో వచ్చే గిరాకీలు ప్రతినిత్యం లక్ష నుంచి రూ.5 లక్షల వరకు యువతులపై డబ్బు విసురుతుంటారు. ఒకరోజు సేకరణ అయ్యే డబ్బులో మొత్తాన్ని పబ్,బార్ల నిర్వాహకులే తీసుకుంటారు. డ్యాన్సర్లకు, మధ్యవర్తులకు నామమాత్రంగా ఇస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement