
చౌటుప్పల్ పీఎస్ వద్ద రోదిస్తున్న నాగరాజు–జ్యోతి దంపతుల పిల్లలతో బంధువు
అడ్డాకుల (దేవరకద్ర): జీవితాంతం కలి సుంటానని భర్తతో ఏడడుగులు నడి చింది.. కానీ ఏడేళ్లు కూడా కాపురం చేయకుండానే ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్నోడిని కర్కశంగా కడతేర్చి.. కన్నపిల్లలను వీధిన పడేసింది.. చివరికి తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వా తిరెడ్డి కేసు మాదిరిగానే నాగరాజు హత్యకు గురవడం గమనార్హం. ఈ కేసులో నిందితులైన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్‌తోపాటు మరో ముగ్గురిని చౌటుప్పల్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ సంఘటనతో నాగరాజు, జ్యోతి దంపతుల ఇద్దరు పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
పెళ్లికి ముందే పరిచయం..
2012 డిసెంబర్‌లో రాచాలకు చెందిన కమ్మరి నాగరాజు(33)కు కోయిలకొండ మండలం అవంగపట్నం గ్రామానికి చెందిన జ్యోతి(24)తో పెళ్లి జరిపించారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో నివాసముంటుండగా నాగరాజు వడ్రంగి పనిచేస్తున్నాడు. వారికి జీవిత(3), విక్కీ (10 నెలలు) పిల్లలున్నారు. అయితే పెళ్లికి ముందే జ్యోతికి హైదరాబాద్‌లో ఉండే కార్తీక్‌తో పరిచయం ఏర్పడగా ప్రేమాయణం సాగించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా జ్యోతి తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఇద్దరి కులాలు వేరు కావడంతో చివరికి జ్యోతిని నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల ప్రియుడు కార్తీక్‌తో జ్యోతి మళ్లీ వివాహేత సంబంధం నెరిపింది. ప్రియుడి మోజులో పడిన జ్యోతి అడ్డుగా ఉన్న భర్త నాగరాజును అంతమొందించాలని పక్కా పథకం రచించి కనికరం లేకుండా హత్య చేయించింది. తన భర్త కనిపించడం లేదని బంధువులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా జ్యోతి కాల్‌డేటా, నాగరాజు శవపరీక్ష నివేదిక ఆధారంగా చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా హత్య కేసును ఛేదించారు.
తల్లి జైలుకు.. పిల్లలు రాచాలకు!
భర్త నాగరాజు హత్య కేసులో నిందితులైన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్, మరో ముగ్గురిని శుక్రవారం చౌటుప్పల్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశం మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. నాగరాజు పిల్లలిద్దరూ రెండు రోజులుగా ఠాణా వద్దే ఉన్నారు. తల్లిని జైలుకు తీసుకెళ్లడంతో నాగరాజు సోదరుడు శ్రీనివాసులు పిల్లలిద్దరిని తీసుకుని రాత్రి రాచాలకు బయలుదేరారు. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడం.. పిల్లలిద్దరు రోదిస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తల్లి చేసిన నేరం పిల్లలిద్దరూ తండ్రిని కోల్పోవడంతోపాటు వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment