ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు శ్రీనివాసరావు జ్యోతి(ఫైల్ )
గుంటూరు, మంగళగిరి: మండలంలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో ఈనెల 11వ తేదీ సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో మృతి చెందిన యువతి అంగడి జ్యోతి మృతిపై పలు అనుమనాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు తెలిపారు.జ్యోతి ఎంఫార్మసీ పూర్తి చేయగా, శ్రీనివాసరావు ఇంటర్ మాత్రమే చదివాడు. ఇద్దరు ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల కిందట తల్లితండ్రులు లేని సమయంలో జ్యోతి ఇంటికి వచ్చిన శ్రీనివాసరావుని ఆమె సోదరుడు ప్రభాకర్ హెచ్చరించారు. అతని తల్లితండ్రులతో కుమారుడిని జాగ్రత్తగా ఉంచుకోవాలని కూడా చెప్పారు. దీంతో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు అక్కడ నుంచి నివాసం మార్చారు. ఇటీవల మరలా అక్కడికే మారి యువతితో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరు కలసి సోమవారం రాత్రి అమరావతి టౌన్‌షిప్‌లోకి చేరుకుని మాట్లాడుకుంటుండగా నలుగురు దుండగులు దాడి చేయడంతోజ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన శ్రీనివాసరావు మండలంలోని చినకాకానిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాలు సేకరించిన పోలీసులు
పోలీసులు యువతి మృతదేహాన్ని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. జ్యోతి సోదరుడు ప్రభాకర్‌తో పాటు బంధువుల నుంచి రూరల్ సీఐ బాలాజీ, ఎస్‌ఐలు బాబూరావు, నాగరాజు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జ్యోతి సోదరుడు ప్రభాకర్ మాట్లాడుతూ తన సోదరికి సోమవారం ఉదయం 11 గంటలకు మరో యువతి ఫోన్ చేసిందని, గుంటూరులోని కళాశాలలో ప్రొవిజన్ సర్టిఫికెట్ తీసుకునేందుకు రావాలని కోరిందన్నారు. తమ తండ్రికి బాగాలేదని.. రేపు వస్తానని చెప్పినా వినకుండా ఒత్తిడి చేయడంతో వెంటనే బయలుదేరి వెళ్లిందని తెలిపారు. శ్రీనివాసరావే తన చెల్లిని మరో యువతితో రప్పించి హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. సోమవారం రాత్రి 8.44 గంటలకు తమ తండ్రి జ్యోతికి ఫోన్ చేయగా పది నిముషాలలో వస్తానని చెప్పిందని, మరలా 9గంటల 15 నిముషాలకు చేయగా స్విచ్చాఫ్ చేసి ఉందని తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువతి హత్యను పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు నోరు తెరిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ భారతి మాట్లాడుతూ యువతి తలపై బలమైన గాయం కారణంగానే మృతి చెందిందని తెలిపారు. రక్తనమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక వస్తే కాని అత్యాచారం జరిగింది లేదా అనేది తెలియదని తెలిపారు.
మాజీ ప్రియుడి పనేనా ?
తాడేపల్లి రూరల్: జ్యోతి మృతి పట్ల ఆమె స్వగ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో సైతం శ్రీనివాస్ కంటే ముందు ఆమె వేరే యువకున్ని ప్రేమించిందని, బహుశా అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు సైతం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేమికులిద్దరు బైక్‌పై వెళ్లినప్పుడు వారిని ఎవరైనా వెంబడించారా? అనే కోణంలో పోలీస్‌లు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
నాకేమీ గుర్తులేదు
ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా తాను అపస్మారక స్థితిలో ఉన్నానని, తనకు ఏమి గుర్తు లేదని చెప్పాడు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారితో మాట్లాడినప్పుడు తాము మాట్లాడుకుంటుండగా నలుగురు యువకులు దాడి చేసి జ్యోతిపై అఘాయత్యానికి పాల్పడినట్లు చెప్పాడు. తాను ప్రతిఘటించగా ఇద్దరిపై దాడి చేశారని, జ్యోతి అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు.
– శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment