అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు | Karnataka Police Arrest Bit Coin Fraud in Hyderabad | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు

Published Tue, Jun 25 2019 8:13 AM | Last Updated on Thu, Jun 27 2019 1:17 PM

Karnataka Police Arrest Bit Coin Fraud in Hyderabad - Sakshi

నిందితుడు గర్దార్‌ దాస్‌

సాక్షి, సిటీబ్యూరో: బిట్‌ కాయిన్స్‌గా పిలిచే క్రిప్టో కరెన్సీ పేరు వాడుకుని నగరంలో భారీ మోసానికి పాల్పడిన గర్దాస్‌ రమేష్‌పై బెంగళూరులోనూ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు పాల్పడ్డాడు. మూడేళ్ళ క్రితం కేసు నమోదు చేసిన అక్కడి అశోక్‌నగర్‌ పోలీసులు రమేష్‌తో పాటు ముగ్గురు హైదరాబాదీయుల్ని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ తీసుకున్న రమేష్‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఇతడిపై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. అతడి ఆచూకీ తెలుసుకున్న వచ్చిన బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. సోమవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. గర్దాస్‌ రమేష్‌ను గత ఏడాది హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మరో నాలుగు కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు ఇతడిపై రిజిస్టర్‌ అయిన కేసుల సంఖ్య 18కి చేరింది. వీటిలో నాలుగింటిలో రమేష్‌ ఇంకా వాంటెడ్‌గా ఉన్నాడు.

బోయిన్‌పల్లి కేంద్రంగా కాయినెక్స్‌ట్రేడింగ్‌ పేరుతో విదేశాల నుంచి నిర్వహిస్తున్నట్లు ఓ నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించిన రమేష్‌ దీని ఆధారంగా రంగంలోకి దిగాడని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు నలుగురు దళారుల్ని ఏర్పాటు చేసుకుని పలువురిని ఆకర్షించాడు. తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి గరిష్టంగా 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి నిండా ముంచాడు. ప్రధాన సూత్రధారి రమేష్‌తో సహా ఐదుగురు నిందితుల్ని హైదరాబాద్‌ పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  కామారెడ్డి జిల్లా దొనకొండకు చెందిన గర్దాస్‌ రమేష్‌ 25 ఏళ్ళ క్రితం నగరానికి వలసవచ్చాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ పలు మోసాలు చేశాడు. వాటికి కొనసాగింపుగా బెంగళూరులో వన్‌ కాయిన్‌ అనే క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం చేశాడు.

దీంతో ఇతడితో పాటు కట్టంగూరి వెంకట్‌రెడ్డి, పల్లా కుమార్‌ యాదవ్, పోతు కనకరాజు తదితరులపై అక్కడి అశోక్‌నగర్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయిన వీరు బెయిల్‌పై బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కేసు వాయిదాలకు హాజరుకాకపోవడంతో వీరిపై న్యాయస్థానం ఎన్‌బీడబ్ల్యూలు జారీ చేసింది. అయినప్పటికీ వీరి ఆచూకీ చిక్కకపోవడంతో అశోక్‌నగర్‌ పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరకు శనివారం ప్రధాన నిందితుడు గర్దాస్‌ రమేష్‌ను కనిపెట్టి అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. మరోపక్క గత ఏడాది ఇతగాడిపై విశాఖపట్నంలోని గాజువాక ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా బోయిన్‌పల్లిలో మరో రెండు రిజిస్టర్‌ అయ్యాయి.  ఈ నాలుగింటిలోనూ రమేష్‌ వాంటెడ్‌గా ఉండటంతో పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement