సాక్షి, బళ్లారి/ కృష్ణరాజపురం/ రాయచూరు రూరల్: కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్న ముగ్గురు కశ్మీరీలు సహా నలుగురు యువకులను, అలాగే ఉగ్రదాడిని సమర్థించిన ఓ కన్నడ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు అనుకూలంగా ఆ ఉపాధ్యాయురాలు వాట్సాప్‌లో పోస్ట్‌లు పెట్టింది. బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మురగోడు శివపురంలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు జిలేఖాబీ పాకిస్థాన్‌కు అనుకూలంగా వాట్సప్‌లో పోస్టింగ్ చేయడం కలకలం సృష్టించింది. ఇది తెలిసి పెద్దసంఖ్యలో స్థానిక ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె ఇంటి ముందు టైర్లకు నిప్పు అంటించి నిరసనకు దిగారు. పాక్‌కు వంతపాడుతున్న యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవలు జరగకుండా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు జిలేఖాబీపై సెక్షన్ 121, 152, 153A కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ముగ్గురు యువకుల అరెస్ట్
ఉగ్రదాడిని సమర్థించిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ శివకుమార్ తెలిపారు. కశ్మీర్ రాష్ట్రానికి చెందిన జాకీర్, వకార్ అహ్మద్, గౌహార్‌లు కేంద్ర ప్రభుత్వ నిధులతో బెంగళూరు గ్రామీణ జిల్లాలోని స్ఫూర్తి కాలేజీలో బీఎస్సీ చదువుతూ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నారు. గురువారం ఉగ్రవాదుల దాడి జరిగిన వెంటనే సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గురూ హాస్టల్ గదిలో డ్యాన్సులు చేశారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ప్రశ్నించగా వారిపై దాడికి తెగబడ్డారు. కాలేజీ ప్రిన్సిపల్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సూర్యనగర్ పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సంబరాలు చేసుకోవడంతో పాటు భారత సైన్యంపై అవమానకర వ్యాఖ్యలు చేశారని, కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయనున్నామని ఎస్పీ శివకుమార్ తెలిపారు.
ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్ట్
కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మరొక ప్రైవేటు ఉద్యోగిని ఆదివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు కమ్మనహళ్లిలో ఉంటున్న స్థానికుడు ఫైజ్ రషీద్ పుల్వామా ఉగ్రవాద దాడులను పొగడడంతో పాటు ‘పిక్చర్ అబి బాకీ హై (సినిమా ఇంకా మిగిలే ఉంది)’ వ్యాఖ్యలు చేసి ఆ పోస్టింగ్‌ను బెంళూరు పోలీసుల ఫేస్‌బుక్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న బాణసవాడి పోలీసులు కేసును సీసీబీ పోలీసులకు బదిలీ చేయడంతో ఆదివారం నిందితుడిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాయచూరులో రంగులు చల్లుకుని సంబరాలు
కశ్మీర్‌లో జవాన్లపై దాడిని పొగుడుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 14వ తేదీ దాడి వార్తలు రాగానే రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా ముదుగల్ మండలం తలకోనలో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. దీనిని ఖండిస్తూ ప్రజల పిలుపు మేరకు ఆదివారం ముదుగల్ బంద్ పాటించారు. నిందితులను అరెస్టు చేయాలని ఒత్తిళ్లు రావడంతో జిల్లా ఎస్పీ కిశోర్‌బాబు ఘటన స్థలానికి వెళ్లి ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే వారి పేర్లను ప్రకటించబోమని, వారిని విచారించి వారిపై క్రిమినల్, దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
సైన్యానికి వ్యతిరేకంగా పోస్ట్, అరెస్ట్
బళ్లారి టౌన్: భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన రాహుల్ పాస్వాన్ అనే యువకుడిని తోరణగల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్ దాడిపై సండూరు తాలూకా తోరణగల్లు నివాసి రాహుల్ పాస్వాన్ భారత సైన్యానికి వ్యతిరేకంగా అవహేళనకరంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో తోరణగల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ యువకుడిని ఆదివారం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment