కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ | KCR Signature has been Forgery | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ

Published Sun, May 19 2019 2:54 AM | Last Updated on Sun, May 19 2019 10:16 AM

KSR Signature has been Forgery - Sakshi

పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.90 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని మ్యుటేషన్‌ చేయాలని దరఖాస్తు చేసిన ముగ్గురు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మ్యుటేషన్‌ ప్రక్రియ సందర్భంగా అధికారులకు అనుమానం రావడంతో.. ధ్రువీకరించుకునేందుకు సీఎంవోను సంప్రదించగా ఈ కుట్ర వ్యవహారం బట్టబయలైంది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి సహకరించిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న క్రమంలోనే హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు, మెట్రో రైల్‌ ఎండీకి కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాంటి లేఖలు రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వీటిపై పూర్తి వివరాలేవీ వెల్లడికాలేదు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌ రావు కేసు వివరాలు వెల్లడించారు.

ఈ సమావేశంలో మాదాపూర్‌ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌ రావు, రాయయదుర్గం సీఐ ఎస్‌.రవిందర్, ఎస్‌ఐలు మురళీధర్, అన్వేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి దారుస్సలాంకు చెందిన కోల్డ్‌ స్టోరేజ్‌ వ్యాపారి మహ్మద్‌ ఉస్మాన్‌ ఖురేషి (50) గచ్చిబౌలి సర్వే నంబర్‌ 44/పీలో 2.02 ఎకరాల స్థలాన్ని గోల్కొండకు చెందిన రజియా సుల్తానా నుంచి కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అయితే ఈ అగ్రిమెంట్‌ పత్రాలు సరైనవా కాదా? అసలు భూమి రజియా సుల్తానా పేరుతోనే ఉందా అనే విషయంపైనా స్పష్టత లేదు. 1954నాటి పహాణీల్లో చాలా మంది పేర్లతో ఇనాం భూముల వివరాలున్నప్పటికీ.. సీలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వచ్చాక అవన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ భూమిగా ఉన్న సర్వేనెంబర్‌ 44/పీ స్థలాన్ని తన పేరుపైకి మ్యుటేషన్‌ చేయించుకునేందుకు ఉస్మాన్‌ ఖురేషి ప్రయత్నించారు. ప్రభుత్వ స్థలం కావడంతో వ్యవహారాన్ని జాగ్రత్తగా నడిపేందుకు పన్నిన వ్యూహం బెడిసి కొట్టడంతో అడ్డంగా దొరికిపోయాడు. 

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ లెటర్‌హెడ్‌పై.. 
ఈ తతంగాన్ని విజయవంతంగా పూర్తిచేసేందుకు శాలిబండలో చెప్పుల షాపు యజమాని రషీద్‌ హుస్సేన్‌ (37)తో జతకట్టాడు. మొగల్‌పురా డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్యదర్శిగా ఉన్న రషీద్‌ హుస్సేన్‌.. రూ.60వేలు తీసుకుని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి హోదాలో రాసే 10 లెటర్‌హెడ్స్‌ను ఖురేషీకి ఇచ్చాడు. ఆ లెటర్‌హెడ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి పేరు, కేసీఆర్‌ ఫొటో, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగో, కింది భాగంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అని రాసుంది. దీనిపై కేసీఆర్‌ చేసినట్లుగా ఓ సంతకం చేశారు. ఈ లెటర్‌హెడ్‌పై మ్యుటేషన్‌ చేయాల్సిందిగా మూసారాంబాగ్‌కు చెందిన బి.అమరేంద్ర (40) టైప్‌ చేశారు. కాగా.. నిజామాబాద్‌కు చెందిన బాబాఖాన్‌ రూ.40 వేలు తీసుకొని లెటర్‌హెడ్‌లను రషీద్‌కు విక్రయించినట్లు తెలిసింది. పరారీలో ఉన్న బాబాఖాన్‌ పట్టుబడితేనే నకిలీ లెటర్‌హెడ్‌లను ఎక్కడ తయారు చేశారో తెలుస్తుందని డీసీపీ తెలిపారు. నిందితులపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 10 లెటర్‌హెడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

సీఎం రికమండేషన్‌ కావడంతోనే అనుమానం 
గచ్చిబౌలి సర్వే నెంబర్‌ 44/పీలో 2.02 ఎకరాల స్థలం విలువ రూ.90 కోట్ల పై మాటే. ఈ స్థలం మ్యుటేషన్‌ కోసం మహ్మద్‌ ఖురేషి దరఖాస్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఫొటో, పార్టీ అధ్యక్షుని హోదాలో సంతకం చేసిన లెటర్‌ను ధరఖాస్తుకు జతపరిచాడు. సీఎం రికమండ్‌ చేస్తున్నట్లుగా లెటర్‌హెడ్‌ ఉండటంతో ఫైల్‌కు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇన్‌వార్డు నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళకు ఫైల్‌ చేరింది. అయితే.. సీఎం రికమండ్‌ చేయడంపై అనుమానం కల్గిన ఆమె దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించారు. పార్టీ అధ్యక్షుని హోదాలో సీఎం సంతకం చేసినట్లు ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆ దరఖాస్తును వాట్సాప్‌లో సీఎంఓకు పంపించారు. సీఎం ఎవరికీ ఇలాంటి రికమండేషన్‌ లెటర్‌ ఇవ్వలేదని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టత వచ్చింది. దీంతో ఈ నెల 15న రాయదుర్గం పీఎస్‌లో ఆర్డీవో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా విలువైన స్థలాన్ని మ్యుటేషన్‌ చేసేందుకు పెట్టుకున్న దరఖాస్తుగా గుర్తించి కుట్రదారులను పట్టుకున్నారు. 

హైదరాబాద్‌ సీపీ, మెట్రో ఎండీకీ లేఖలు 
గచ్చిబౌలి వివాదంలో ఈ ఫోర్జరీ వ్యవహారం తెరపైకి వచ్చినా విచా రణ సందర్భంగా.. నిందితులు సీఎం పేరుతో కొంతకాలం కింద దొంగలేఖలు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చారని వెల్లడైంది. చాదర్‌ఘాట్‌లో 300 చద రపు గజాల స్థలం వివాదంలో ఉం దని, త్వరగా పరిష్కరించాలని సీఎం ఫొటో, సంతకం ఉన్న సిఫారసు లేఖతో హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు దర ఖాస్తు అందింది. చాదర్‌ఘాట్‌లో మరో 200 చదరపు గజాల స్థలానికి నష్ట పరిహరం రాలేదని, సమస్యను పరిష్కరించాలని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి లెటర్‌ పంపారు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే సీపీ, మెట్రోరైల్‌ ఎండీ కార్యాలయాల్లో ఈ ఫైల్స్‌ పరిష్కారం ఏ స్టేజీలో ఉందనే విషయం మాత్రం తెలియలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement