కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు? | Keerthi Abortion in Amangal Rangareddy | Sakshi
Sakshi News home page

కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?

Published Fri, Nov 1 2019 10:06 AM | Last Updated on Fri, Nov 1 2019 10:25 AM

Keerthi Abortion in Amangal Rangareddy - Sakshi

ఆమనగల్లు: హయత్‌నగర్‌లో తల్లి రజితను చంపిన కీర్తికి ఆమనగల్లు పట్టణంలో అబార్షన్ జరిగిందని ప్రసారమాధ్యమాల్లో రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆమనగల్లులో అనుమతి లేకుండా నడుస్తున్న ఆస్పత్రుల్లో ఎలాంటి అర్హతలు లేని అర్‌ఎంపీలు గర్భస్రావాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆమనగల్లు అబార్షన్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీర్తి ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గతంలో ఓ బాలికకు అబార్షన్ చేయడంతో ఆర్‌ఎంపీపై కేసు కూడా నమోదైంది. ఆమనగల్లులో అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నా వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.  

గుట్టుచప్పుడు కాకుండా..
హయత్‌నగర్‌కు చెందిన రజితను ఆమె కూతురు కీర్తి ప్రియుడితో కలిసి చంపేసింది. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. కీర్తి గర్భవతి కావడంతో ఆమె ప్రియుడు బాల్‌రెడ్డి శశికుమార్‌ సహకారంతో ఎల్‌బీ నగర్‌లోని సహారా ఎస్టేట్స్‌లో ఉంటున్న ఓ వైద్యుడిని సంప్రదించారని తెలిసింది. అతడి సలహా మేరకు కీర్తి ఆమనగల్లు పట్టణంలో ఈ ఏడాది జనవరిలో అబార్షన్ చేయించుకున్నట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా ఆమె ఆమనగల్లులో గర్భస్రావం చేయించుకున్నా.. తల్లిని హత్య చేయడంతో ఈవిషయం వెలుగుచూసింది.  

ఆర్‌ఎంపీలదే హవా
ఆమనగల్లు పట్టణంలో ఆర్‌ఎంపీల హవా నడుస్తోంది. దాదాపు 10 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా ఎక్కువగా ఆర్‌ఎంపీలే నిర్వహిస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో రోగుల ప్రాణాలు తీస్తున్నారు. డబ్బులకు ఆశపడి ఇష్టారాజ్యంగా అబార్షన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అసురక్షిత పద్ధతులతో గర్భం దాల్చిన మహిళలు, బాలికలు గర్భస్రావం కోసం ఆమనగల్లుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్‌ఎంపీలు అడిగినంత డబ్బులు ఇచ్చి గుట్టుగా అబార్షన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్‌ఎంపీలు అవసరమున్నా, లేకున్నా రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్‌ పరీక్షలు చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. పట్టణంలో నాలుగు స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు పరీక్షలు చేయించుకుంటున్నారు. నిర్వాహకులు ప్రతిరోజూ ఆర్‌ఎంపీల వాటాగా కొంత కమీష¯Œ  ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో అవసరం ఉన్నా లేకున్నా పరీక్షలకు రెఫర్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?
హత్య కేసులో నిందితురాలైన కీర్తికి అబార్షన్ చేసింది ఎవరోనని పట్టణంలో జనం గుసగుసలాడుకుంటున్నారు. పోలీసుల విచారణలో కీర్తి ఆమనగల్లులో అబార్షన్ చేసుకున్నట్లు చెప్పింది. ఈ ఘనటకు సంబంధించి ఆమెకు అబార్షన్ చేసిన డాక్టర్‌పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో స్థానిక ఆర్‌ఎంపీలు, డాక్టర్లలో గుబులు మొదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement